మృతుల పేరిట రుణాలు

ABN , First Publish Date - 2020-02-08T05:30:00+05:30 IST

ఐటీ ఉద్యోగులకు సిబిల్‌ స్కోరు బాగుంటుంది కదా! వారికి బ్యాంకులు కూడా రుణాలు వెన్వెంటనే ఇస్తుంటాయి కదా! అందుకే, ఆ ముఠాకు చనిపోయిన ఐటీ ఉద్యోగులే పెట్టుబడి. గత ఏడాది నవంబరు 24న మాదాపూర్‌ పరిఽధిలో బీఎండబ్ల్యూ కారు

మృతుల పేరిట రుణాలు

53.95 లక్షలు కొల్లగొట్టిన ముఠా

ఆట కట్టించిన సైబరాబాద్‌ పోలీసులు

చనిపోయిన ఐటీ ఉద్యోగులే లక్ష్యం

సిబిల్‌ స్కోరు బాగుండడమే వరం

వారి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు

వాటి ఆధారంగా రుణాలు, క్రెడిట్‌ కార్డులు

ఆరుగురి అరెస్టు.. సీపీ సజ్జనార్‌ వెల్లడి


ఉదయాన్నే పేపరు చదువుతారు! అందులో వచ్చిన క్రైమ్‌ వార్తలపై దృష్టిపెడతారు! ఐటీ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే వారి వివరాలను సేకరిస్తారు! వారి నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి బ్యాంకుల నుంచి రుణాలు కొల్లగొడతారు! ఇలా నాలుగు నెలల్లోనే బ్యాంకులను ఏకంగా రూ.50 లక్షలకుపైగా మోసం చేసిన ఘరానా ముఠా ఆటను సైబరాబాద్‌ పోలీసులు కట్టించారు! ఆరుగురిని అరెస్టు చేసి, ఐ-20 కారు, 100 ఫేక్‌ ఐడీ కార్డులు; 6 సెల్‌ఫోన్లు; 20 సిమ్‌ కార్డులు; ఒక ప్రింటర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాళ్ల సరికొత్త సైబర్‌ దందాను చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇటీవల దేవీపట్నంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి పేరిట కూడా ఈ ముఠా భారీగా రుణం తీసుకోవడం విశేషం.


ఐటీ ఉద్యోగులకు సిబిల్‌ స్కోరు బాగుంటుంది కదా! వారికి బ్యాంకులు కూడా రుణాలు వెన్వెంటనే ఇస్తుంటాయి కదా! అందుకే, ఆ ముఠాకు చనిపోయిన ఐటీ ఉద్యోగులే పెట్టుబడి. గత ఏడాది నవంబరు 24న మాదాపూర్‌ పరిఽధిలో బీఎండబ్ల్యూ కారు ఢీకొని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై వెళ్తున్న ఐటీ ఉద్యోగి అభిషేక్‌ ఆనంద్‌ మరణించాడు. వెంటనే రంగంలోకి దిగిన ముఠా.. ఆయన స్నేహితులుగా చెప్పుకొని పూర్తి వివరాలు సేకరించింది. ఫేస్‌బుక్‌లో ఆయన ఫొటో, మెయిల్‌ ఐడీ తీసుకుంది. వాటితో నకిలీ గుర్తింపు కార్డులు; ధ్రువపత్రాలు సృష్టించింది. అభిషేక్‌ వాడిన నంబర్‌తో కొత్త సిమ్‌ కార్డు తీసుకుంది. ఆ నంబర్‌తో లింక్‌ చేసి ఉన్న వివిధ బ్యాంకుల్లో అతని ఖాతాలను తెలుసుకుంది. ఆ తర్వాత బ్యాంకు అధికారులు, కస్టమర్‌ కేర్‌ను సంప్రదించింది. తద్వారా, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో లాగిన్‌ అయింది. కొత్త పాస్‌వర్డు క్రియేట్‌ చేసుకుంది. అభిషేక్‌ సిబిల్‌ స్కోర్‌ బాగుండడంతో ఇన్‌స్టంట్‌ రుణం కోసం వివిధ బ్యాంకుల్లో దరఖాస్తు చేసింది. హెచ్‌డీఎ్‌ఫసీలో రూ.14,86,794, ఐసీఐసీఐలో రూ.7 లక్షల రుణం మంజూరైంది. ఆ నిధులను ఇతర బ్యాంకుల్లో తాము తీసిన ఖాతాలకు మళ్లించుకుంది. అలాగే, గత ఏడాది సెప్టెంబరు 15న దేవీపట్నంలో జరిగిన బోటు ప్రమాదంలో రేపాకుల విష్ణుకుమార్‌ మరణించినట్లు పత్రికల్లో వచ్చింది. ఆయన యాష్‌ టెక్నాలజీ్‌సలో పనిచేసేవారు. ఆ వివరాలు సేకరించిన కేటుగాళ్లు.. విష్ణుకుమార్‌ బ్యాంకు ఖాతాల నుంచి రుణాలు, క్రెడిట్‌ కార్డులు, బ్యాలెన్స్‌ అమౌంట్‌ కలిపి మొత్తం రూ.13,50,506 కొల్లగొట్టారు. సెప్టెంబరు 4న మరణించిన ఐబీఎం ఉద్యోగి అవకాశ్‌ మహంత పేరిట హెచ్‌ఎ్‌ఫడీసీ బ్యాంకులో రుణం, బ్యాంకులో ఉన్న డబ్బు సహా రూ.5,90,741 దోచేశారు.  అక్టోబరు 14న తాను పనిచేస్తున్న ఇన్ఫోసిస్‌ కార్యాలయం పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి పాలపర్తి రఘురామ్‌ పేరిట రూ.12.64 లక్షలు కొల్లగొట్టారు. ఇలా 4 నెలల్లోనే రూ.53,95,043 దోచేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శనివారం మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ ఈ వివరాలు వెల్లడించారు.


ఆరుగురి ముఠా ఇదే

పోలీసులు అరెస్టు చేసినవారిలో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన నిమ్మగడ్డ ఫణి చౌదరి ఇంటర్‌ వరకు చదివాడు. ఒంగోలు ఆర్టీఏ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ.. నకిలీ ఐడీ కార్డులు, పాన్‌ కార్డులు తయారు చేసిచ్చేవాడు. తర్వాత హైదరాబాద్‌ వచ్చాడు. వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించిన కేసులో 2011లో మాదన్నపేట పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. 2012లో సీసీఎస్‌ పోలీసులకూ చిక్కాడు. తర్వాత ఇల్లీగల్‌ కాల్‌ రౌటింగ్‌ పేరిట రూ.47 లక్షలు కొల్లగొట్టిన కేసులో గతేడాది రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు పట్టుబడి జైలుపాలయ్యాడు. సైబర్‌ క్రైం కేసుల్లో తనతోపాటు పాలు పంచుకున్న స్నేహితుడు మండవ స్వరూపనాథ్‌ చౌదరి, అతడి స్నేహితులు పెడవల్లి శ్రీనివాసరావు, కొండ్రు హరీశ్‌, నార్నె వేణుగోపాల్‌, ఇక్కుర్తి వీరశేఖర్‌రావు అలియాస్‌ చింత శ్రీనివాసరావుతో ముఠాగా ఏర్పడ్డారు. మృతుల వివరాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకుంటారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌, సోషల్‌ మీడియా సైట్ల ద్వారా చనిపోయిన వారి ఫొటోలు సేకరిస్తారు. కొన్నిసార్లు వారి పేరిట క్రెడిట్‌ కార్డులు తీసుకుంటారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఇన్‌స్టంట్‌ రుణం కొల్లగొడతారు. రుణాలు, క్రెడిట్‌ కార్డులను చనిపోయిన వ్యక్తుల పేరిట తీసుకున్నారు కాబట్టి అడిగే వారు ఉండరు. బ్యాంకు అధికారులకు చిక్కరు దొరకరు.


తీగలాగితే కదిలిన డొంక

పాలపర్తి రఘురామ్‌ హెచ్‌డీఎ్‌ఫసీ క్రెడిట్‌ కార్డును వేరే వ్యక్తి వాడుతున్నారని ఆ బ్యాంకు సీనియర్‌ మేనేజర్‌ గుర్తించారు. అప్పటికే రూ.2.76 లక్షలు కొల్లగొట్టడంతో ఇది సైబర్‌ నేరగాళ్ల పనే అయి ఉంటుందని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏడీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై విజయ్‌వర్థన్‌ బృందం రంగంలోకి దిగింది. తీగ లాగితే ఘరానా ముఠా బాగోతం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారులు విచారణ లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల ఇలాంటి సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయని సజ్జనార్‌ అన్నారు. దీనిపై ఆర్బీఐ, బ్యాంకుల ఉన్నతాధికారులకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-02-08T05:30:00+05:30 IST