ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలే ముఖ్యం

ABN , First Publish Date - 2020-04-08T09:11:25+05:30 IST

అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయని, ఇలాంటి సమయంలో భారత్‌కు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని మంత్రి కేటీఆర్‌...

ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలే ముఖ్యం

  • వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకు లాక్‌డౌన్‌ ఉండాల్సిందే
  • గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రి పనులను 3 రోజుల్లో పూర్తి చేయండి 
  • అధికారులను ఆదేశించిన మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌
  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని భాస్కర ఆస్పత్రి తనిఖీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయని, ఇలాంటి సమయంలో భారత్‌కు లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆర్థిక ప్రగతి కన్నా ప్రజల ప్రాణాలే తొలి ప్రాధాన్యం అని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గేంతవరకు లాక్‌ డౌన్‌ కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కరోనాను ఎదుర్కోలేక అగ్రరాజ్యాలే విలవిలలాడుతున్నాయన్నారు. అమెరికా, యూర్‌పలోని ఇటలీ, స్పెయిన్‌లో నెలకొన్న పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్‌డౌన్‌, భౌతిక దూరం పాటించడమే మార్గమని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించారని చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ మార్గదర్శిగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో  ఒక్క ఆకలి చావు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారికీ జీతాలివ్వాలని యాజమాన్యాలకు సూచించామని చెప్పారు.  


విచ్చలవిడి టెస్టులకు అనుమతించబోం

కరోనా హాట్‌ స్పాట్లుగా పేర్కొంటున్న ప్రాంతాల్లో వైద్య పరీక్షలకు సంబంధించి సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వైర్‌సపై భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో విచ్చలవిడి వైద్య పరీక్షలకు అనుమతించేది లేదన్నారు. ఒకవేళ అనుమతిస్తే ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లు ప్రజల భయాందోళనలను ఆసరా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌ వలన ప్రజలకు, సమాజానికి, ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి నిరోధమే అత్యంత కీలకమైన అంశమన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు. 3 దశల్లో కరోనాను ఎదుర్కోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పీపీఈలు, మాస్కులు, ఇతర వైద్య సామాగ్రిని సమకూర్చడం, మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టామన్నారు. 15,000 పడకలను సిద్దం చేస్తున్నామని, అవసరమైతే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు.


Updated Date - 2020-04-08T09:11:25+05:30 IST