కేరళ గోల్డ్ స్కామ్‌లో హైదరాబాద్‌కు లింక్!
ABN , First Publish Date - 2020-07-19T23:21:06+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేరళ బంగారం స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కేరళ గోల్డ్ స్కామ్‌లో హైదరాబాద్‌కు లింక్ ఉన్నట్లు అధికారులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కేరళ బంగారం స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. కేరళ గోల్డ్ స్కామ్‌లో హైదరాబాద్‌కు లింక్ ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ వ్యవహారంలో నగదు చెల్లింపులు హైదరాబాద్‌లో జరిగినట్లు కష్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బును హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి తరలించినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్న సురేష్, సందీప్ నాయర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ నెల 6 తేదీన దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో తరలిస్తున్న ముప్పై కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే హైదరాబాద్‌లోని హవాలా వ్యవహహారంపై ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
కేరళ గోల్డ్ స్కామ్‌లో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్వప్నతో పాటు తిరువనంతపురానికి చెందిన సందీప్ నాయర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అటు కేరళ సర్కారు సీఎం ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ను తప్పించింది. స్వప్న ఐటీ శాఖలో నియమించడానికి, సీఎంవోలో స్వేచ్ఛనివ్వడానికి కారకుడంటూ ఆయనపై వేటు వేసింది. అయితే.. సీఎం పినరయి విజయన్‌కు, స్వప్న దగ్గరి సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్వప్న సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో విజయన్‌తోపాటు ప్రముఖులతో దిగిన ఫొటోలున్నాయి. ఆమె కెరీర్ మొత్తం వివాదాలమయమే. తొలుత తిరువనంతపురంలో ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేసిన స్వప్న 2010-11లో దుబాయ్ వెళ్లింది. అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తుండగా ఆరోపణలు రావడంతో మళ్లీ కేరళకు వచ్చింది. తర్వాత ఎయిర్ ఇండియా ఏజెంట్‌గా తిరువనంత పురంలో పనిచేసింది. యూఏఈ కాన్సులేట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం సంపాదించింది. అక్కడా ఆరోపణలు రావడంతో తొలగించారు.