ఐటీ రంగానికి ఆకాశమే హద్దు

ABN , First Publish Date - 2020-06-25T08:44:54+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఎగుమతులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు భారీగా ఊడుతున్నాయి.

ఐటీ రంగానికి ఆకాశమే హద్దు

లాక్‌డౌన్‌లో 46 వేల కోట్ల ఐటీ ఎగుమతులు 

‘వర్క్‌ ఫ్రం హోం’ రెండేళ్ల వరకూ ఉండొచ్చు 

త్వరలో రాష్ట్రంలో ‘ఈఎంసీ’ పాలసీ 

భవిష్యత్తులో  పెరగనున్న ఉపాధి చాన్సులు 

‘ఆంధ్రజ్యోతి’తో ఎస్‌టీపీఐ డైరెక్టర్‌  సీవీడీ రాంప్రసాద్‌ 


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఎగుమతులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు భారీగా ఊడుతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఐటీ రంగంలో మాత్రం పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతోందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సటీపీఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డైరెక్టర్‌ సీవీడీ రాంప్రసాద్‌ అన్నారు. లాక్‌డౌన్‌లో ఐటీ రంగం పరిస్థితి, రాష్ట్రంలో కేంద్ర ఐటీ శాఖ చేపట్టనున్న ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 


ఐటీలో పెరిగిన అవకాశాలు

భారత ఐటీ కంపెనీల క్లయింట్లు ఎక్కువగా ఉన్న అమెరికా, యూరప్‌ దేశాల్లో అనేక కంపెనీలు లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. దీని ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పడుతుందని ప్రారంభంలో ఆందోళన వ్యక్తమైంది. అయినా అలాంటిదేమీ జరగలేదు. పైపెచ్చు అవకాశాలు మరింతగా పెరిగాయి. ఇతర దేశాలకు చెందిన కొత్త క్లయింట్లు కూడా భారత ఐటీ కంపెనీల సేవలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో భారతీయ ఐటీ కంపెనీలకు క్లయింట్లు పెరుగుతున్నారు. సాధారణంగా ఎస్‌టీపీఐల పరిధిలో ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ఐటీ ఎగుమతులు రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయి. ఈసారి లాక్‌డౌన్‌ కాలంలో రికార్డు స్థాయిలో రూ.45 వేల కోట్లు జరిగాయి. ఇది తెలంగాణలో రూ.10 వేల కోట్ల వరకు ఉంది. గతంలో ఐటీ వినియోగం కొన్ని రంగాలకే పరిమితమయ్యేది. నేడు అన్ని రంగాలకు తప్పనిసరిగా మారింది.

 

‘వర్క్‌ ఫ్రం హోం’కు అలవాటైపోయారు 

ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లోనే ‘వర్క్‌ ఫ్రం హోం’ ఆప్షన్‌ను వినియోగించుకునేవారు. యాజమాన్యాలు సైతం అంగీకరించేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కంపెనీలు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఉద్యోగులూ ఈ సంస్కృతికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 98ు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇప్పటి పరిస్థితిని చూస్తుంటే ఈ విధానం రెండేళ్ల వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 


ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ అవకాశాలు

ఐటీ కంపెనీలను రాష్ట్ర రాజధానుల వరకే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇండియా బీపీవో ప్రమోషన్‌ స్కీం(ఐబీపీఎస్‌) అమల్లో ఉంది. తెలంగాణలో 5 కంపెనీలకు 2600 ఐబీపీఎస్‌ సీట్లు కేటాయించారు. ఒక్కో సీటుకు కేంద్ర ఐటీ శాఖ లక్ష రూపాయలు అందజేస్తుంది. రాష్ట్రంలోని వరంగల్‌లో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీలో 35 కంపెనీలకు 14,692 సీట్లు కేటాయించారు.  అలాగే ‘నెక్స్ట్‌ జనరేషన్‌’ ప్రోగ్రాం పేరిట ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనుంది. తొలి విడత ప్రాజెక్టులో విజయవాడ మాత్రమే ఎంపికైంది. తర్వాత దశలో తెలంగాణ నుంచి ద్వితీయ శ్రేణి నగరాలు ఎంపిక కానున్నాయి.


త్వరలో ఈఎంసీ

గతంలో కేంద్రం ప్రకటించిన ఈఎంసీ(ఎలకా్ట్రనిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌) పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్ర ఐటీ శాఖ జూన్‌ ఒకటిన విడుదల చేసింది. దీని ప్రకారం ఎలకా్ట్రనిక్‌ రంగంలో పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి కేంద్రం ప్రోత్సాహకాలు అందించనుంది. దీంతో తెలంగాణాలో పరిశ్రమలు పెరిగి..ఉపాధి అవకాశాలూ  పెరగనున్నాయి. 

Updated Date - 2020-06-25T08:44:54+05:30 IST