ప్రతి గింజనూ కొంటాం
ABN , First Publish Date - 2020-10-07T07:40:01+05:30 IST
రాష్ట్రంలో వానాకాలం సాగైన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొందరపడి తక్కువ

రైతులు తొందరపడి ధాన్యాన్ని
తక్కువ ధరకు అమ్మొద్దు
6 వేల పైగా కొనుగోలు కేంద్రాలు
17ు కంటే తక్కువ తేమపై మద్దతు ధర
ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు
పత్తి పూర్తిగా సీసీఐ ద్వారానే: కేసీఆర్
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానాకాలం సాగైన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొందరపడి తక్కువ ధరకు పంటను అమ్ముకోవొద్దని రైతులను ఆయన కోరారు. ధాన్యాన్ని 17 శాతం తేమకు లోబడి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.1888, సాధారణ రకానికి క్వింటాకురూ.1868 కనీస మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఐకేపీ సెంటర్లు, కో-ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. తాలు, పొల్లు లేకుండా ఎగబోసిన ధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడొద్దని రైతులను కోరారు.
వానాకాలం పంటల కొనుగోలు అంశంపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు దాకా ప్రతి విషయంలోనూ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని కేసీఆర్ పేర్కొన్నారు. అన్నదాతలు ఎలాంటి ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా గింజ మిగలకుండా వరి పంటనంతా కొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీసీఐతో సంప్రదింపులు
పత్తి పంటను కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలున్న రైతులకు ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు.