చెరువులన్నీ నింపేద్దాం
ABN , First Publish Date - 2020-05-18T08:40:59+05:30 IST
వానాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు ప్రాజెక్టుల కాలువల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ర్టిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన

ప్రాజెక్టుల నుంచి పంపింగ్ మొదలవగానే..
ఏడాదంతా చెరువుల్లో నీరుంచే వ్యూహం
ప్రతి ప్రాజెక్టుకూ మాన్యువల్
ఎస్సారెస్పీ కింద 16 లక్షల ఎకరాలకు నీళ్లు
దేవాదుల నీటిని ఏడాదంతా లిఫ్టు చేయాలి
సాగునీటి వ్యవహారాలు ఒకే గొడుగు కిందకు
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో
వానాకాలం వ్యూహంపై సమీక్షలో కేసీఆర్
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు ప్రాజెక్టుల కాలువల నుంచి అవసరమైన తూములు (ఓటీలు), డిస్ర్టిబ్యూటరీ కెనాళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. చెరువులు, కుంటలు ఏడాదంతా నింపి ఉంచే వ్యూహం అవలంబించాలని, చెరువుల్లో నీరు నింపేందుకు ఉన్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు, మూడు రోజుల్లోనే సమావేశం కావాలని ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వానాకాలం అవలంబించాల్సిన వ్యూహంపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంపుల నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్‌గేజ్‌లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో సాగునీటి వ్యవహారమంతా ఒకే గొడుగు కిందకు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల భౌగోళిక స్థితిని బట్టి నీటి పారుదల శాఖను పునర్‌వ్యవస్థీకరించాలని ఆదేశించారు. సీఈ, ఈఎన్సీ.. పరిధులు నిర్ణయించి, నీటి పారుదల జోన్లు ఏర్పాటు చేయాలని, అత్యవసరమైన సాగునీటి పనులకు అనుమతులు ఇవ్వడానికి సీఈ నుంచి ఈఈ వరకు అధికారాలను ప్రభుత్వం బదిలీ చేస్తుందని తెలిపారు. సీఈ రూ.50 లక్షలు, ఎస్‌ఈ రూ.25 లక్షలు, ఈఈ రూ.5 లక్షల పనుల వరకు అనుమతులు ఇవ్వవచ్చన్నారు.
ఎస్సారెస్పీని కాళేశ్వరం నీటితో నింపాలి
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఈ వానాకాలంలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరిలో పైనుంచి వచ్చే వరదను అంచనా వేసుకుంటూ ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ద్వారా నింపాలని ఆదేశించారు. ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతం 6వేల క్యూసెక్కులు ఉన్న నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలన్నారు. కాళేశ్వరంలో మూడో టీఎంసీని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలని, గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తిచేసి ఈ సీజన్‌లోనే నీరందించాలని చెప్పారు. చెరువుల నుంచి మట్టిని స్వచ్ఛందంగా తీసుకుపోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇక దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలని, సమ్మక్క బరాజ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలన్నారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని, వాటిపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలచి చెప్పారు. ఇక మల్లన్నసాగర్ ద్వారా తపా్‌సపల్లి రిజర్వాయర్‌ను నింపాలని, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలని అన్నారు. జగిత్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో ముక్కట్‌రావుపేట గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని సూచించారు.
15 రోజుల్లోగా కొత్త గేజ్ మీటర్లు!
అన్ని ప్రాజెక్టులపై 15 రోజుల్లోగా కొత్తగా గేజ్ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నీటి పారుదల శాఖ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ తయారు చేయాలని, సేకరించిన భూములను వెంటనే మ్యుటేషన్ చేయించాలని అన్నారు. కాల్వ కట్టలపై నిర్మాణాలు నేరం, ప్రమాదకరమని, ఇప్పుడు అన్ని కాలువల్లో నీళ్లు రానున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అధికారులు కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఎంతో వ్యయం చేసి నిర్మించిన ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించడమూ ముఖ్యమని సీఎం అన్నారు. ప్రతి ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓఅండ్‌ఎం రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో నిర్వహణ వ్యయం కేటాయించి, నిధులు విడుదల చేస్తామన్నారు. ఎక్కడైనా భూసేకరణ మిగిలి ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఈటల, ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కమలాకర్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.