‘ఆధార్‌’పై ఏంచేద్దాం!

ABN , First Publish Date - 2020-12-19T06:53:12+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు తగిన

‘ఆధార్‌’పై ఏంచేద్దాం!

హైకోర్టు తాజా ఆదేశాలతో సర్కారు పునరాలోచన

ప్రత్యామ్నాయ కార్డు సూచిద్దామా సుప్రీంలో అప్పీలు చేద్దామా!

నిపుణులతో నేడు కేసీఆర్‌ సమీక్ష

 

 హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు తగిన మార్పులు చేసి ముందుకెళ్లాలా? లేక సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాలా? అని ఆలోచిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ‘యూజర్‌ మాన్యువల్‌’లో ఉన్న ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగించాలని, అప్పటివరకు స్లాట్ల బుకింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించిన విషయంతో తెలిసిందే.


దీంతో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో రెవెన్యూ, న్యాయశాఖ నిపుణులతో సమీక్షించనున్నారు. రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు ఉండకుండా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. కాపీ అందిన తర్వాత కూలంకశంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 


‘సుప్రీం’ మెట్లెక్కితే... జాప్యమేనా!

హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లదలిస్తే.. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ నిలిచిపోతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 8న నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు మూడు నెలల విరామ అనంతరం ఈ నెల 14న ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్లాట్ల బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ, ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగించాలని,  అప్పటివరకు స్లాట్ల బుకింగ్‌ను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బుక్‌ అయిన స్లాట్ల విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చునని, కొత్త స్లాట్ల బుకింగ్‌ ఉండదని చెబుతున్నారు.


ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ నిర్ణయం వెలువడే వరకూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో మళ్లీ నిలిచిపోతే మరింత చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ దృష్ట్యా సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా?అన్నదానిపై సీరియ్‌సగా దృష్టి పెట్టింది. దీనిపై శనివారం తుది నిర్ణయం వెలువడనుంది.


ఆధార్‌ తొలగింపుపై సందిగ్ధం

హైకోర్టు సూచించినట్లు యూజర్‌ మాన్యువల్‌ నుంచి ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగించాలా? వద్దా? అన్నదానిపై సందిగ్ధం ఏర్పడింది. ఆధార్‌ కార్డు కాలమ్‌ను తొలగిస్తే... దానికి ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులుగా వేటిని సూచించాలన్న దానిపై కసరత్తు చేయనుంది. సీఎం సమీక్ష సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు రానుంది. ఇదివరకు ‘కార్డు’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వహించిన రిజిస్ట్రేషన్లలో కూడా ఆధార్‌ కార్డు నంబర్లను అడిగేవారు.


కాకపోతే... కార్డుపై ఉన్నమొదటి 8 నంబర్లను హైడ్‌ చేసి, చివరి నాలుగు డిజిట్లే కనిపించేలా చేసేవారు. దీంతో గోప్యతను పాటించినట్లుగా ఉండేది. ఇప్పుడు ఆధార్‌ కార్డు కాలమ్‌ను తీసేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఆధార్‌ లేకుండా వ్యక్తులను గుర్తించేదెలా అన్న మీమాంసలో ఉంది. ఆధార్‌కు బదులు ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటివి తీసుకోవచ్చని రిజిస్ట్రేషన్‌ వర్గాలు వివరిస్తున్నాయి. 
హైకోర్టు ఆదేశాలు ఇవీ.. 


యూజర్‌ మాన్యువల్‌లో ఆధార్‌కు సంబంధించిన ప్రస్తావనను తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, ఆస్తిపన్ను నెంబరు (పీటీఐఎన్‌) కోరే వారిని ఆధార్‌ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టరాదు. రిజిస్ట్రేషన్‌ మాత్రం కొనసాగించవచ్చు.

రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ ఆధార్‌ నెంబరు ఇవ్వాలని రిజిస్ట్రేషన్‌ చేసే అధికారి పట్టుబట్టరాదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక వ్యక్తిని గుర్తించడానికి మరేదైనా అధికారిక పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. 

కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్‌ నంబర్లు, కులం, సామాజిక హోదా వివరాలను కోరే కాలమ్స్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలి. కుటుంబ సభ్యుల ఆధార్‌ వివరాలు, కుల సమాచారం అడగబోమని రాష్ట్ర ప్రభుత్వమే అండర్‌టేకింగ్‌ ఇచ్చింది. అందుకే స్లాట్‌ బుకింగ్‌కు ఈ వివరాలను కోరే ప్రస్తావనను యూజర్‌ మాన్యువల్‌ నుంచి తొలగించాలి. 

ఆస్తి రిజిస్టర్‌కు ఆధార్‌ వివరాలు ఇవ్వడం స్వచ్ఛందమేనని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు ముందు చెప్పలేదు. అందుకే తాను ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను అతిక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోలేదు. అండర్‌టేకింగ్‌కు అనుగుణంగా యూజర్‌ మాన్యువల్‌ను మార్చాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధార్‌ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు మాన్యువల్‌ స్పష్టం చేస్తోంది. ఇది ప్రభుత్వ తెలివైన, మభ్యపెట్టే చర్య. కోర్టుకు ఇచ్చే అండర్‌టేకింగ్‌ను అతిక్రమించే తెలివైన కుట్ర. మభ్యపెట్టే చర్యలను కోర్టు అనుమతించదు. 


Read more