20 నుంచి పాఠాలు
ABN , First Publish Date - 2020-08-11T08:55:51+05:30 IST
పాఠశాల విద్య, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలలుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది.

తొలుత 6-10 తరగతుల విద్యార్థులకు దూరదర్శన్ బోధన
1వ తేదీ నుంచి 3, 4, 5 తరగతుల వారికీ!
17నుంచి బడికి ఉపాధ్యాయులు!
రోజూ కనీసం 50ు టీచర్లు రావాల్సిందే
20న ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
17 నుంచే ‘ఇంటర్’ ఆన్‌లైన్ బోధన
అన్ని అనుమతులు పొందిన ప్రైవేటు
కళాశాలలకే ‘ఆన్‌లైన్’ చాన్స్?
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడు నెలలుగా ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించింది. ఎంసెట్‌తో పాటు వాయిదాపడ్డ మరో రెండు సెట్ల తేదీలను ప్రకటించింది. పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు సంబంధించి కూడా ఆన్‌లైన్ తరగతులపై తన విధానాన్ని స్పష్టం చేసింది. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘దోస్త్’ నోటిఫికేషన్ తేదీనీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరచుకోనున్నాయి. ముందుగా ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వస్తారు. ఇక 17 నుంచే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించనున్నారు. 20 నుంచి 6-10 తరగతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యకు సంబంధించి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం ఆమె కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన పాల్గొన్నారు.
3 సెట్ల తేదీలు ఖరారు
ఎంసెట్ పరీక్షను సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిసారి ఇంజనీరింగ్‌తో పాటు మెడిసిన్ (అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ) పరీక్ష కూడా జరుపుతుండగా.. ఈసారి నాలుగు రోజులూ కేవలం ఇంజనీరింగ్ అభ్యర్థులకే పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షకు కూడా హాజరవుతారు. జేఈఈ (మెయిన్స్) సెప్టెంబరు 1-6 వరకు జరగనుండగా.. ఈ సారి ఆ పరీక్షలు ముగిసిన రెండు రోజుల తర్వాత ఎంసెట్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ఈసారి అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసిన ఎంసెట్ మెడిసిన్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష తేదీలు ఖరారు చేయలేదు.
ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశాలకు పాలిటెక్నిక్ విద్యార్థులకు నిర్వహించే ఈసెట్‌ను ఈ నెల 31న నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష సెప్టెంబరు-2న ఉంటుంది.
ప్రతిసారి ఎంసెట్ పరీక్షలు వరుసగా నాలుగు రోజులు నిర్వహిస్తుండగా.. ఈసారి మూడు, నాలుగో పరీక్షకు మధ్యలో 2 రోజుల విరామం ఇచ్చారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’ సెప్టెంబరు-13న ఉండడమే దీనికి కారణం.
డిగ్రీ ఫైనలియర్ పరీక్షలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ విషయం ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉండడంతో న్యాయస్థానాల తీర్పు మేరకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో కొత్త అడ్మిషన్లు, ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశమున్నందున ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణపై చర్చించారు. విద్యాసంవత్సరం వృథా కాకుండా వారికి కూడా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు.
ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ విద్య, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల సంస్థలు దూరదర్శన్, మన టీవీ ద్వారా తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో టైం స్లాట్లు దొరికే అవకాశం లేకుంటే ప్రైవేట్ ఛానళ్ల ద్వారా అయినా ప్రసారం చేయాలని భావిస్తున్నాయి.
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి గతంలో వాయిదాపడ్డ ‘దోస్త్’ షెడ్యూల్ ఈ నెల 20న ప్రకటించనున్నారు. మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణపై యూనివర్సిటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోనందున.. ఈసారి తరగతుల ప్రారంభం ప్రస్తావన లేకుండానే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
17 నుంచి ఆన్‌లైన్‌లో బోధన
ఈ నెల 17 నుంచి డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయి.
2020-21 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల అనుమతులు ఇంకా పూర్తవలేదు. ప్రభుత్వ కాలేజీలకు రెండు రోజులుగా అనుమతులు ఇస్తుండగా.. ప్రైవేటు కళాశాలల విషయంలో వివాదం నడుస్తోంది. ఈసారి అన్ని అనుమతులు పొందిన ప్రైవేటు కళాశాలలకే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
20 నుంచి దూరదర్శన్ పాఠాలు
ఈ నెల 17 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరచుకోనున్నాయి. ముందుగా ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు వస్తారు..
ప్రతి పాఠశాలలో రోజూ కనీసం 50 శాతం ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నెల 20 నుంచి ముందుగా 6-10 తరగతుల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా తరగతుల బోధన ఉంటుంది. రోజూ ఎన్ని తరగతులు నిర్వహించాలన్నది కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ఏ తరగతులకు ఏ సమయంలో పాఠాలు ప్రసా రం అవుతాయో ముందుగా ప్రకటిస్తారు.
పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు విద్యార్థులకు వర్క్‌షీట్లు అందిస్తారు. దూరదర్శన్ ద్వారా పాఠాలు విన్న తర్వాత విద్యార్థికి ఆ విషయంపై అవగాహన కల్పించేందుకు వీటిని ఇప్పటికే ఎన్‌సీఈఆర్టీ రూపొందించింది.
దూరదర్శన్‌తో పాటు ప్రసారమైన పాఠాలను ఇంటర్‌నెట్ సౌలభ్యం ఉన్న విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.
3,4,5 తరగతుల విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు సెప్టెంబరు-1 నుంచి కొనసాగుతాయి.