నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం!

ABN , First Publish Date - 2020-06-04T09:33:02+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అనంతగిరి, రంగనాయకసాగర్‌

నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం!

2013 భూసేకరణ చట్ట ప్రకారం తిరిగి లెక్కించాలి.. ఇప్పటికే చెల్లించిన డబ్బు వసూలు చేయొద్దు

పిటిషనర్లకు 2వేల చొప్పున కోర్టు ఖర్చులు 

పరిహారం ఒకే సారి చెల్లించాలి: హైకోర్టు

ఏజీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం

కాళేశ్వరం ముంపు బాధితుల కేసుల్లో తుది ఆదేశాలు


హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అనంతగిరి, రంగనాయకసాగర్‌ రిజర్వార్ల ముంపు బాధితులకు 2013నాటి భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఆయా ప్రాజెక్టుల కింద భూములు, ఇళ్లు కోల్పోతున్న అనేకమంది బాధితులు దాఖలు చేసిన పలు వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. కోర్టును ఆశ్రయించిన 120 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. భూసేకరణ చట్ట(2013) ప్రకారం పరిహారంతోపాటు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ కింద ఏకమొత్తంగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదని, వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ దాఖలు చేసిన మెమోను ధర్మాసనం తిరస్కరించింది.


అన్నపూర్ణసాగర్‌ రిజర్వాయరు(అనంతగిరి) కోసం నిర్వాసితుల నుంచి బలవంతంగా చేయించుకున్న ఒప్పందాలు 1872నాటి కాంట్రాక్టు  చట్టంలోని సెక్షన్‌ 19, 23 ప్రకారం చెల్లవని స్పష్టం చేసింది. అధికారులు తమ చర్యల ద్వారా  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 300ఏ కింద పిటిషనర్లకు కల్పించిన హక్కులకు భంగం కలిగించారని, 2013నాటి భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టం చేసింది. పిటిషనర్లకు చెల్లించాల్సిన పరిహారాన్ని భూసేకరణ చట్ట ప్రకారం తిరిగి లెక్కించాలని తెలిపింది. మెదక్‌ జిల్లా అల్లిపూర్‌ గ్రామానికి చెందిన అక్కిపల్లి మోహన్‌రెడ్డి మరో 44 మంది పిటిషనర్లకు సంబంధించిన పశువులశాలలు, షెడ్లు, బోరుబావులు తదితరాలకు పిటిషన్‌లో పేర్కొన్న విధంగా పరిహారం పొందేందుకు వారు అర్హులని స్పష్టం చేసింది. అన్ని వ్యాజ్యాల్లోని పిటిషనర్లూ 2017లో తెచ్చిన సవరణ చట్టంలోని సెక్షన్‌ 31-ఏ ప్రకారం ఏకమొత్తంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద లబ్ధి పొందేందుకు అర్హులని తేల్చిచెప్పింది. పరిహారం తిరిగి లెక్కించడానికి ఇంతకుముందే చెల్లించిన మొత్తాలను వసూలు చేయరాదని స్పష్టం చేసింది. దీని ప్రకారం పిటిషనర్లకు చెల్లించాల్సిన బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. 


విచారణ వాయిదాకు ధర్మాసనం తిరస్కృతి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అనంతగిరి, రంగనాయక సాగర్‌ రిజర్వార్ల ముంపు బాధితులు 2017-19 మధ్యకాలంలో వేర్వేరు పిటిషన్ల ద్వారా హైకోర్టుకు వెళ్లారు. ఇవి తొలుత సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. వీటిపై ధర్మాసనం మధ్యంతర ఆదేశాలిచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ సాగింది. కేసుల విచారణ రోస్టర్‌ మారడంతో ఈ వ్యాజ్యాలు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చాయి. వీటిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించడంపై ఏజీ అభ్యంతరాలు తెలిపారు. ఆడియో,వీడియో స్పష్టంగా లేదని, ఈ వ్యాజ్యాలను అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదని, వాయిదా వేయాలని కోరారు.


అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇదే ధర్మాసనం ముందు కొవిడ్‌పై దాఖలైన వ్యాజ్యాల్లో ఏజీ వాదనలు చెప్పారని, ఏజీ, మరొకరు వెబ్‌ కెమెరా ముందు కూర్చుని వాదనలు చెప్పారని, ఆ దృశ్యాలు స్ర్కీన్‌పై స్పష్టం కన్పించాయని జడ్జి పేర్కొన్నారు. ఆ వ్యాజ్యాల్లో లేని అభ్యంతరాలు నిర్వాసితుల పరిహారం కేసుల్లో ఎందుకుండాలని ప్రశ్నించారు. ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం ఈమేరకు తుది తీర్పు వెలువరించింది. 

Updated Date - 2020-06-04T09:33:02+05:30 IST