రాజకీయ డ్రామాకు రాజ్‌భవన్‌ వేదిక కాదు

ABN , First Publish Date - 2020-10-03T09:31:35+05:30 IST

రాజకీయ డ్రామాకు రాజ్‌భవన్‌ వేదిక కాదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

రాజకీయ డ్రామాకు రాజ్‌భవన్‌ వేదిక కాదు

విజ్ఞప్తులను ఈ మెయిల్‌ ద్వారా ఇవ్వొచ్చు

కరోనా వల్ల సందర్శకులను అనుమతి లేదు

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ 

రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ సేవలు ప్రారంభం 


హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాజకీయ డ్రామాకు రాజ్‌భవన్‌ వేదిక కాదని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వినతిపత్రం ఇద్దామంటే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. కరోనా కారణంగా గత 4 నెలలుగా రాజ్‌భవన్‌కు సందర్శకులను అనుమతించడం లేదని పేర్కొన్నారు. విజ్ఞప్తులు, ఫిర్యాదులను ఈ-మెయిల్‌ ద్వారా ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలను కోరామని చెప్పారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తమిళనాడు, ఏపీ కంటే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వానికి తాను అనేక సూచనలు చేశానని, ప్రభుత్వం కూడా పాటించిందని చెప్పారు. ఇప్పుడు అనేక జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.


‘‘మా నాన్న గాంధేయవాది. నేనూ గాంధేయవాదినే. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను పాటిస్తాను. సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాలి.’ అని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లోని ఈ కార్యాలయం 24 గంటలు పనిచేస్తుందని, ఎలాంటి సమస్యలు అయినా ప్రజలు వెబ్‌సైట్‌ ద్వారా తెలపవచ్చన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. చట్టాల్లోని కొన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, తన ఉద్దేశంలో మాత్రం కొత్త చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని, రైతు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు.  


మహాత్మునికి గవర్నర్‌, సీఎం నివాళులు 

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. గాంధీజీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అయితే, కరోనా నేపథ్యంలో 13 మందినే అనుమతించారు. 

Updated Date - 2020-10-03T09:31:35+05:30 IST