నన్ను నలిపెయ్యాలని చూసిండ్రు!
ABN , First Publish Date - 2020-11-13T08:46:13+05:30 IST
‘‘టీఆర్‌ఎస్ ఓటమి స్వయంకృతమే. మితిమీరిన అహంకారం, మనిషిని మనిషిగా గౌరవించని కుసంస్కారం. ఏం చేసినా చెల్లుతుందన్న
దుబ్బాక విజేత రఘునందన్‌రావుతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ
ఆ ముగ్గురి వైఖరిని ఓటర్లు ఎండగట్టారు.. టీఆర్‌ఎస్ ఓటమి స్వయంకృతమే
ఉద్యమ నాయకత్వాన్ని విస్మరించింది
ఓటర్లు అసాధారణ తీర్పు ఇచ్చారు
మోదీ పట్ల విశ్వసనీయత పెరిగింది
సంజయ్ నాయకత్వంలో పార్టీ కొత్తపుంతలు
దుబ్బాక.. ఈ మూడక్షరాలే నా ప్రాధాన్యం
‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మెల్యే రఘునందన్‌రావు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘టీఆర్‌ఎస్ ఓటమి స్వయంకృతమే. మితిమీరిన అహంకారం, మనిషిని మనిషిగా గౌరవించని కుసంస్కారం. ఏం చేసినా చెల్లుతుందన్న దురహంకారం. ఫలితమే అధికార పార్టీకి ఎదురుదెబ్బ’’ అని దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ముగ్గురు తనను నలిపేయాలని చూశారని, వారి వైఖరిని దుబ్బాక ఓటరు ఎండగట్టారని చెప్పారు. దీపావళి తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో తొలి సమీక్ష నిర్వహిస్తానన్నారు.
ఎన్నో ఒత్తిళ్లు, ప్రలోభాలు, చివరికి భయభ్రాంతులకు గురిచేసినా ఓటరు తన తీర్పును అసాధారణ రీతిలో ఇచ్చారని రఘునందన్ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం తనను, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎంత వేధించారో గుర్తించిన ప్రజలు, తమ నిశబ్ద ఓటుతో సమాధానం ఇచ్చారని రఘునందన్ ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.
ఎమ్మెల్యేగా మీ ప్రాధామ్యాలు ఏమిటి?
చేనేత, బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. వ్యవసాయ రంగం, మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలి. చేనేత కార్మికులకు కేంద్రం ప్రకటించిన పథకం ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక్క నేతన్నకూ ముద్ర రుణం ఇవ్వలేదు. 250 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులే ధ్రువీకరించారు. చేనేత సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. సిద్దిపేట సెగ్మెంటులో ప్రాజెక్టు నిర్వాసితులకు 15లక్షలు, గజ్వేల్ నియోజకవర్గంలో 20లక్షలు పరిహారం ఇస్తుండగా, దుబ్బాకలో మాత్రం 6 లక్షలే ఇస్తున్నరు. ఇదెక్కడి న్యాయం? ఇక, బీడీ కార్మికులకు పింఛన్లు, కార్డులు తొలగించిండ్రు. కొంతమందికి ఈఎ్‌సఐ సౌకర్యం కూడా తీసేసిండ్రు.
నియోజకవర్గ అభివృద్ధిపై కార్యాచరణ రూపొందించారా?
ఎందుకు వెనుకబాటు, వివక్షకు గురైందన్నదే ప్రధాన అంశంగా భావిస్తా. ఎలా చేయాలన్నదానిపై అధికారులతో కలిసి నిర్ణయిస్తాం. ఇందుకోసం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరతా. దీపావళి తర్వాత సమీక్ష ఉంటుంది. నిధుల విడుదలలో జాప్యంపై సమీక్షిస్తాం. నిధుల దుర్వినియోగంపై ప్రత్యేకంగా చర్చిస్తాం.
మీ విజయానికి దోహదపడ్డ ప్రధాన అంశాలు?
కార్యకర్తల అంకుఠిత దీక్ష. ప్రజలు మార్పు కోరుకున్నరు. బీజేపీ మాత్రమే టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయమని విశ్వసించారు. ప్రధాని మోదీ పట్ల రోజురోజుకీ విశ్వసనీయత పెరుగుతోంది. రాష్ట్ర పార్టీ సారథి సంజయ్ నేతృత్వంలో బీజేపీ కొత్త పుంతలు తొక్కుతోందని ప్రజలు గుర్తించారు.
టీఆర్‌ఎస్ ఓటమి, ఆ పార్టీలో పరిణామాలపై ఏమంటారు?
స్వయంకృతాపరాధం. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని, కార్యకర్తలను విస్మరించింది. డబ్బున్నోళ్లకే ప్రాధాన్యమిచ్చింది. నేల విడిచి సాముచేసింది. టీఆర్‌ఎస్‌లో పరిణామాలు వారి అంతర్గత వ్యవహారం. నో కామెంట్.
‘ఒక్క అవకాశం’ అన్న మీ విజ్ఞప్తి వెనుక నేపథ్యం..?
టీఆర్‌ఎస్ విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఏమాత్రం మంచిది కాదు. ఉద్యమం ప్రారంభమైన గడ్డ నుంచే ఈ నినాదాన్ని ఎత్తుకున్న. ప్రజలు విశ్వసించిండ్రు. అందుకే నా వైపు మొగ్గుచూపిండ్రు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మధ్యలో వాళ్లు నన్ను దీవించారంటే నాపై ఎంత నమ్మకం ఉంచిండ్రో తెలిసిపోతుంది. రఘునందన్‌కు డిపాజిట్ వస్తే ఎక్కువని, ఓటమి తప్ప గెలవడం తెలువదని వారు ప్రచారం చేసిండ్రు.
రాష్ట్ర రాజకీయాలపై దుబ్బాక ఫలితం ప్రభావం ఏమిటి?
దుబ్బాక అనే మూడక్షరాలే నాకు ముఖ్యం. రాష్ట్ర రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అదంతా మా రాష్ట్ర పార్టీ చూసుకుంటది. నియోజకవర్గానికే పరిమితమవుతా. ప్రస్తుత కార్యక్రమాలు కొనసాగిస్తా. భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ చేపట్టే ఏ కార్యక్రమానికైనా తు.చ. తప్పకుండా పనిచేస్తా. ఎంత ఎత్తుకు ఎదిగినా నేను సామాన్య కార్యకర్తనే.
మీ విజయ రహస్యం..?
కార్యకర్తలతో నిత్యం కలిసి ఉండడం. అనుక్షణం నియోజకవర్గాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేయడం. ప్రజా సేవ కోసం ఒక లక్ష్యం పెట్టుకున్న. ప్రజాప్రతినిధి అయితే విస్తృత సేవ చేయవచ్చని విశ్వసించా. ఎమ్మెల్యే అంటే ఇలా కూడా పనిచేయవచ్చా అన్న రీతిలో పనిచేస్తా.
మీ లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నరు?
దుబ్బాకకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి మాత్రమే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని, ఈ గడ్డకు న్యాయం చేయాలని ఒక విద్యావంతుడిగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో అనుకున్న. ఉద్యమంలో నాతో పాటు పనిచేసిన వారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయంగా ముందడుగు వేసినప్పుడు చూసిన నేను, రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేయవచ్చని అనుకుని రాజకీయాల్లోకి వచ్చిన.
రెండు ఓటముల తర్వాత.. విజయం ఎలా ఉంది?
గెలుపోటములను సమాన స్థాయిలో స్వీకరించే శక్తి భగవంతుడు నాకు ఇచ్చిండు. ఓడిపోయినప్పుడు కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. ఇప్పుడ సేవ చేసే అదృష్టం దక్కిందని భావిస్తున్న. రెట్టించిన పట్టుదలతో కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను నిలదీశాం. రైతులతో పాటు అన్నివర్గాలవారికి అండగా ఉన్నాం.