50 కోట్ల భూమికి ఏసీపీ నర్సింహారెడ్డి ఎసరు
ABN , First Publish Date - 2020-10-03T09:57:11+05:30 IST
పోలీసు అధికారి హోదాను అడ్డం పెట్టుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి.. రూ.50 కోట్లు విలువ చేసే భూమికి ఎసరు పెట్టినట్లు ఏసీబీ అధికారులు

నిషేధిత జాబితాలో ఉన్న భూమికి.. మునిసిపల్ నంబర్లతో రిజిస్ట్రేషన్
సైబర్‌టవర్స్ వద్ద గోల్‌మాల్
మరో ఎనిమిది మంది అరెస్టు
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారి హోదాను అడ్డం పెట్టుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఏసీపీ నర్సింహారెడ్డి.. రూ.50 కోట్లు విలువ చేసే భూమికి ఎసరు పెట్టినట్లు ఏసీబీ అధికారులు నిగ్గుతేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నర్సింహారెడ్డి నేరశైలిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిషేధిత జాబితాలో ఉన్న రూ.50 కోట్లు విలువచేసే భూమిని.. సర్వే నంబరు ప్రకారం కాకుండా.. మునిసిపల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేల్చారు. నర్సింహారెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములైన 8 మందిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో.. జి.సజ్జన్‌గౌడ్, పి.తిరుపతిరెడ్డి, వై.చంద్రశేఖర్, ఎ.జైపాల్, మధుకర్ శ్రీరాం, బండి చంద్రారెడ్డి, బత్తిని రమేశ్, ఎ.శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
హైటెక్ సిటీ వద్ద భూమిపై కన్ను
మాదాపూర్ సైబర్‌టవర్స్ సమీపంలోని సర్వేనెంబరు 64లో ఉన్న ప్రభుత్వ భూమిని ఉమ్మడి ఏపీలోనే.. పరిశ్రమల అభివృద్ధి సంస్థ, హుడా (ప్రస్తుతం హెచ్‌ఎండీఏ)కు అప్పగించారు. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా సెక్షన్ 22ఏ(1)(ఏ)లో చేర్చారు. ఆ భూమిపై కన్నేసిన నర్సింహారెడ్డి 1,960 చదరపు గజాల స్థలాన్ని నాలుగు ప్లాట్లుగా విభజించి జి.సజ్జన్‌గౌడ్, పి.తిరుపతిరెడ్డి, వై.చంద్రశేఖర్, ఎ.జైపాల్ పేర్లతో 2016లో నకిలీ పత్రాలు సృష్టించారు. వారి నుంచి గజానికి రూ.20వేల చొప్పున చెల్లించి.. 2018లో కొనుగోలు చేసినట్లు పత్రాలను సృష్టించారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఆ భూమి ధర రూ.6కోట్లు కాగా.. మార్కెట్ ధర రూ.50 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఓ కమర్షియల్ నిర్మాణానికి నర్సింహారెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే.. భవన నిర్మాణం కూడా ప్రారంభమయ్యేది. ఇంతలో ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో.. విషయం బయటపడింది. కాగా.. ఏసీబీ అధికారులు నర్సింహారెడ్డిని సోమవారం కస్టడీకి తీసుకుని, విచారించనున్నారు.