భూ సెటిల్‌మెంట్లు.. బెదిరింపులు

ABN , First Publish Date - 2020-08-20T09:53:56+05:30 IST

ఓవైపు సత్వర సేవలు, విధి నిర్వహణలో పారదర్శకత, స్మార్ట్‌, పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నినాదాలతో దేశంలోనే తెలంగాణ పోలీసు విభాగం

భూ సెటిల్‌మెంట్లు.. బెదిరింపులు

  • సివిల్‌ వివాదాల్లో తలదూరుస్తున్న పోలీసులు
  • అవినీతితో పాటు క్రిమినల్‌ కేసుల్లోనూ ప్రమేయం
  • ఏడు నెలల్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఏడుగురు
  • రాచకొండలో ఏసీపీ, హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌పై వేటు
  • విధుల్లో నిర్లక్ష్యం, ఆరోపణలతో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఓవైపు సత్వర సేవలు, విధి నిర్వహణలో పారదర్శకత, స్మార్ట్‌, పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నినాదాలతో దేశంలోనే తెలంగాణ పోలీసు విభాగం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ, ఇదే సమయంలో కొందరు అధికారులు, సిబ్బంది సివిల్‌ వివాదాలు, క్రిమినల్‌ కేసులు, అవినీతి వ్యవహారాల్లో తలదూర్చుతూ అప్రతిష్ఠ తెస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్‌ల పరిధిలో ముగ్గురు అధికారులపై వేటు పడటం సహా.. ఇటీవలి కాలంలో వెలుగుచూసిన పలు ఉదంతాలే దీనికి నిదర్శనం. 


వీఐపీ జోన్‌లో పనిచేస్తున్నా..

గత ఏడు నెలల్లో ఏడుగురు పోలీసు సిబ్బంది (ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక ఏఎ్‌సఐ, కానిేస్టబుల్‌) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ )కు పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యంత కీలకమైన పశ్చిమ మండల పరిధి  ేస్టషన్లలో విధులు నిర్వహిస్తున్నవారు కావడం గమనార్హం. జిల్లాలు, మారుమూల  ేస్టషన్లలో పర్యవేక్షణ అంతగా ఉండకపోవచ్చు. కానీ, ప్రముఖులు ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌  ేస్టషన్లపై నిరంతరం ఉన్నతాధికారుల నిఘా ఉంటుంది. అలాంటి చోట పనిచేస్తున్నా కొందరు డబ్బు, మద్యం డిమాండ్‌ చేస్తున్నారు.


కోర్టు ఆదేశాల అమలు,  ేస్టషన్‌ బెయిల్‌, ఎఫ్‌ఐఆర్లో పేరు తొలగింపు, కేసు నుంచి తప్పించేందుకు.. ఇలా ఎక్కడ వీలు దొరికితే అక్కడ వసూళ్లు చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొందరైతే క్రిమినల్‌ కేసుల్లోనూ ప్రమేయం కలిగి ఉంటున్నారు. ఏసీబీ కేసులను పక్కనపెడితే.. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి ఆరోపణలపై శాఖాపర చర్యలకు గురవుతున్నవారి లెక్క చాలా ఎక్కువగా ఉంటోంది.


కేసుల పేరిట భయపెట్టి..

భూ వివాదాల్లో వేలుపెట్టడం.. అవసరమైతే కేసుల పేరిట ప్రజలను భయాందోళనలకు గురిచేయడం ఇదీ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భూ వివాదంలో కలుగజేసుకున్న వనస్థలిపురం ఏసీపీ జయరాం తీరు. ఆయన వేధింపులు తాళలేక బాధితులు నేరుగా రాచకొండ సీపీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఏసీపీపై ఆరోపణలు నిజమని తేలడంతో వేటు పడింది. ఇదే భూ వ్యవహారంతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి సంజీవరెడ్డి నగర్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణకూ సంబంధం ఉంది. ఓ మహిళ కేసు విషయంలోనూ  వీరిద్దరిపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇక స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌పై విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇదంతా 2రోజుల వ్యవధిలోనే జరిగింది.

Updated Date - 2020-08-20T09:53:56+05:30 IST