రూ.20కోట్ల అసైన్డ్‌ భూమి హాంఫట్‌

ABN , First Publish Date - 2020-12-25T05:36:27+05:30 IST

జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న రూ.20కోట్ల విలువైన ఏడెకరాల ప్రభుత్వ అసైన్డ్‌భూమి అధికారుల సాక్షిగా.. కబ్జాకు గురువుతోంది. ఈ తతంగమంతా తెలిసి కూడా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు.

రూ.20కోట్ల అసైన్డ్‌ భూమి హాంఫట్‌

జనగామ జిల్లాలో జాతీయ రహదారి పక్కనే 7 ఎకరాల భూమి కబ్జా
పేద దళితులకిచ్చిన భూమి అన్యాక్రాంతం
అధికారుల మిలాఖత్‌తో అక్రమ నిర్మాణాలు


లింగాలఘణపురం, డిసెంబరు 24: జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న రూ.20కోట్ల విలువైన ఏడెకరాల ప్రభుత్వ అసైన్డ్‌భూమి అధికారుల సాక్షిగా.. కబ్జాకు గురువుతోంది. ఈ తతంగమంతా తెలిసి కూడా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు.  జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామ రెవెన్యూ శివారు, పటేల్‌గూడెం గ్రామపంచాయితీ పరిధిలోని ఏడెకరాల అసైన్డ్‌ భూమిని మూడుదశాబ్దాల కిందట నెల్లుట్ల గ్రామానికి చెందిన పేద దళితులకు జీవనభృతి కోసం ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే పేదదళితుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకున్న ఓ ప్రముఖుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2008లో బాండ్‌పేపరుపై అసైన్డ్‌ భూమి తనపేర గిఫ్ట్‌అండ్‌ సేల్‌ డీడ్‌ సెటిల్‌మెంట్‌ను కుదర్చుకున్నాడు. ఆ తర్వాత   అప్పటి తహసీల్దార్‌ అండదండలతో తనపేరిట పాస్‌బుక్కులు కూడా జారీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో సదరు భూమిని కాపాడుకునేందుకు సొసైటీ పేరుతో ఓ బోర్డును అసైన్డ్‌ భూమిలో ఏర్పాటు చేశారు.

బాధితుల ఫిర్యాదు
లింగాలఘణపురం మండలం నెల్లుట్ల రెవెన్యూ శివారులోని 7.01 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమి వ్యవహారంలో స్థానికుడు 2013లో అప్పటి తహసీల్దార్‌ పద్మావతికి ఫిర్యాదు చేయడంతో భూ అక్రమ దందా వెలుగు చూసింది. అప్పటి తహసీల్దార్‌ పద్మావతికి అనేక రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ భూదందా వ్యవహారంపై ఉన్నతాధికారులకు పూర్తిస్థాయి నివేదికను అందజేసింది. ఫలితంగా అక్రమణకు గురైన 7.01 ఎకరాల అసైన్డ్‌ భూవ్యవహారం జనగామ రెవెన్యూ(ఆర్డీవో)కోర్టు పరిధిలోకి వెళ్లింది. తొమ్మిదేళ్లుగా సాగిన వాదోపవాదాల అనంతరం నెల్లుట్ల రెవెన్యూ శివారులోని అసైన్డ్‌భూమి పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనుగోలు సాగాయని రెవెన్యూ అసైన్డ్‌ యాక్ట్‌ ప్రకారం సదరు భూమిని కొనుగోలు చేసే అధికారం ఎవ్వరికీ లేదని గతేడాది 2019 డిసెంబర్‌ 28న ప్రస్తుత జనగామ ఆర్డీవో మధుమోహన్‌ తుది తీర్పును వెలువరిస్తూ  అప్పీలేట్‌ ఫైల్‌ను డిస్మిస్‌ చేశారు.

ఆర్డీవో జడ్జిమెంట్‌ బుట్టదాఖలు
ప్రభుత్వ భూముల సంరక్షణకు పాటుపడాల్సిన లింగాలఘణపురం రెవెన్యూ అధికారులు  ఆర్డీవో వెలువరించిన జడ్జిమెంట్‌ ఆదేశాలను లెక్కచేయకుండా భూ ఆక్రమణకు పరోక్షంగా చేయూతనివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2019 డిసెంబరు 28న అప్పిలేట్‌ ఫైల్‌ను డిస్మిస్‌ చేసిన ఉత్తర్వుల సమాచారం 2020 జనవరి 13న తనకార్యాలయానికి వచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు.   నెల్లుట్ల రెవెన్యూ శివారులో జనగామ-సూర్యాపేట జాతీయ రహదారికి ఆనుకుని ఎకరాకు రూ.3కోట్ల డిమాండ్‌ కలిగిన 7.01 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో ఆక్రమిత అసైన్డ్‌భూమిలో రెండు గదుల భవననిర్మాణంతో పాటు చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయడం గమనార్హం. అలాగే ఈ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్‌ అవసరాలకు విద్యుత్‌ అధికారులు డీటీఆర్‌ బిగించారు. భూమి నాలా మార్పిడి జరగకపోయినా కమర్షియల్‌ అవసరాలకు ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించడం నిబంధనలకు విరుద్ధమని పలువురుపేర్కొంటున్నారు.

ఆర్డీవో జడ్జిమెంట్‌ నా దృష్టికి రాలేదు..
శ్రీనివాస్‌, లింగాలఘణపురం తహసీల్దార్‌
నెల్లుట్ల అసైన్డ్‌ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసు ఆర్డీవో కోర్టు తుదితీర్పు అంశం నా దృష్టికి రాలేదు. రెవెన్యూ చట్టం ప్రకారం అసైన్డ్‌భూములను ఒరిజనల్‌ అసైనీదారులు అమ్మడం గానీ, ఇతరులు కొనుగోలు చేయడం చెల్లనేరదు.

అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేశాం..
సాయి, పంచాయతీ కార్యదర్శి, పటేల్‌గూడెం
పటేల్‌గూడెం గ్రామపంచాయితీ పరిధిలో అసైన్డ్‌ భూమిలో అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తుండటంతో గ్రామపంచాయతీ కార్యాలయం ద్వారా నోటీసులు జారీ చేశాం. జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి ఆదేశానుసారం అక్రమ నిర్మాణాలు తొలగించాలని మూడో నోటీసును కూడా అందజేశాం.

Updated Date - 2020-12-25T05:36:27+05:30 IST