నిర్వాసితులను అర్ధరాత్రి తరలించలేదు

ABN , First Publish Date - 2020-04-26T08:31:15+05:30 IST

అనంతగిరి రిజర్వాయరు ముంపు గ్రామం అయిన సిద్దిపేట జిల్లా పోచగట్టుపల్లి వాసులను అర్థరాత్రి ఖాళీచేయించలేదని...

నిర్వాసితులను అర్ధరాత్రి తరలించలేదు

  • హైకోర్టులో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కౌంటర్

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి రిజర్వాయరు ముంపు గ్రామం అయిన సిద్దిపేట జిల్లా పోచగట్టుపల్లి వాసులను అర్థరాత్రి ఖాళీచేయించలేదని భూసేకరణ అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె. అనంతరెడ్డి హైకోర్టుకు నివేదించారు. పోచగట్టుపల్లిలోని నిర్వాసితులు అందరూ ప్రభుత్వ ప్యాకేజీకి ఆమోదం తెలిపారని, 148 మంది ప్యాకేజీ తీసుకుని గ్రామాన్ని ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లినట్లు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన 6 కుటుంబాలే గ్రామంలో ఉన్నట్లు తెలిపారు. వీరుకూడా గ్రామాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకున్నారని, అయితే ఈనెల 18న అడ్డం తిరిగారన్నారు. వారిని సాయంత్రం 6-9 గంటల మధ్య ఖాళీచేయించినట్లు తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా 250 గజాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు వారిని తరలించినట్లు తెలిపారు. బాధితులకు చెల్లించాల్సిన పరిహారం చెక్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు.  వీరికి 15 రోజులకు సరిపడా నిత్యావసరాలు సమకూర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కౌంటర్‌పై పిటిషనర్ల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం రీ-జాయిండర్‌ వేసేందుకు అవకాశం ఇచ్చింది.

Updated Date - 2020-04-26T08:31:15+05:30 IST