బరితెగించిన భూకబ్జాదారులు

ABN , First Publish Date - 2020-12-25T07:22:30+05:30 IST

అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూమిని ఆక్రమించారు.. అక్రమంగా నిర్మాణాలూ చేపట్టారు..

బరితెగించిన భూకబ్జాదారులు

ఇన్‌స్పెక్టర్‌పైనే పెట్రోలు చల్లి నిప్పు

మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బంది కళ్లలో కారం

ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావుకు తీవ్ర గాయాలు 

జవహర్‌నగర్‌లో అక్రమార్కుల అరాచకం

ఓ మంత్రి అండదండలతోనే రెచ్చిపోయారు?

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఉద్రిక్తత


జవహర్‌నగర్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల కోసం కేటాయించిన భూమిని ఆక్రమించారు.. అక్రమంగా నిర్మాణాలూ చేపట్టారు.. వాటిని తొలగించేందుకు వెళ్లిన అధికారులపై తిరగబడ్డారు.. బరి తెగించిన భూకబ్జాదారులు పోలీసులు, మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బంది కళ్లలో కారం చల్లారు! సీఐపై పెట్రోలు పోసి నిప్పంటించారు! ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కబ్జాదారులకు అధికార పార్టీతో పాటు కాషాయ పార్టీ నేతలూ వంత పాడారు. వారికి మద్దతుగా అక్రమ నిర్మాణాల వద్ద బైఠాయించారు. అక్రమార్కులకు ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నాయని.. అందుకే రెచ్చిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూకబ్జాదారుల దాడిలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో జరిగింది. 


మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో పలు స్థలాలను అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. కార్పొరేషన్‌ పరిధిలో మినీ స్టేడియం నిర్మాణానికి సర్వే నంబరు 706లో 1.37ఎకరాలు, 704లో 3.03 ఎకరాలు, హెర్బల్‌ పార్కు కోసం సర్వే నబరు 759లో 2.11ఎకరాలు, 974లో 1.32 ఎకరాలు, ఆధునిక మరుగుదొడ్లు (మోడ్రన్‌ టాయిలెట్లు) కోసం సర్వే నంబరు 432లో 1500 గజాలు, 495లో 510 గజాలు, సర్వే నంబరు 510లో 17గుంటలు, తంగేడు వనం కోసం సర్వే నంబరు 647లో 1.34 ఎకరాలు, 648లో 4.10 ఎకరాల్లో కేటాయించారు. కానీ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, మున్సిపల్‌ అధికారుల ఉదాసీనత కారణంగా కొన్ని స్థలాలు ఇప్పటికే అన్యాక్రాంతం అయ్యాయి.


సర్వే నంబరు 432లో మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణం కోసం కలెక్టర్‌ స్థలం కేటాయించినప్పటికీ అందులో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా పరిగణించిన మున్సిపల్‌, రెవెన్యూ అదికారులు వాటిని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతమహంతి ఆదేశాల మేరకు సర్వే నంబరు 432లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు గురువారం సాయత్రం 4గంటలకు అక్కడకి చేరుకున్నారు.


విషయం తెలుసుకున్న అక్రమ నిర్మాణదారుడు పూనమ్‌చంద్‌ కూడా అక్కడికి చేరుకోగా.. ఆయన భార్య అక్కడ నిర్మించిన గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు వచ్చి అధికారులను అడ్డుకొని నినాదాలు చేశారు. 5 గంటల సమయంలో అక్రమ నిర్మాణదారుడి అనుచరులు పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లారు. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్‌ సీఐ భిక్షపతిరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు.


గది ముందు బైఠాయించిన పూనమ్‌చంద్‌, బీజేపీ నాయకులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. గది తలుపులు తెరవబోయారు. అదే సమయంలో లోపల ఉన్న మహిళ ఒక్కసారిగా పెట్రోలు పోసి నిప్పంటించడంతో సీఐ భిక్షపతిరావుకు మంటలు అంటుకున్నాయి. కిందపడి పొర్లడంతో మంటలు ఆరిపోయినా.. అప్పటికే రెండు చేతులు, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ మహిళకు కూడా గాయాలయ్యాయి. 


అధికార పార్టీ అండదండలతోనే.. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి టీఆర్‌ఎస్‌ నాయకులే అండగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని, అందుకే భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వే నంబరు 432లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని విలేకరులు ఆ మంత్రిని ప్రశ్నించగా.. మాట దాటవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

Updated Date - 2020-12-25T07:22:30+05:30 IST