చెట్లు లేకపోవడమే కరువు: మంత్రి జగదీష్ రెడ్డి
ABN , First Publish Date - 2020-06-25T21:16:31+05:30 IST
మానవ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన కారణం పర్యావరణ సమస్య అని..

సూర్యాపేట: మానవ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన కారణం పర్యావరణ సమస్య అని, చెట్లు లేకపోవడమే కరువని, వర్షాలు రాకపోవడానికి కూడా ప్రధాన కారణమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం ఆరోవిడత హరితహారం కార్యక్రమం సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి సారిగా ప్రాధాన్యత ఇచ్చి ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో 240 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రతి యేటా ఉద్యమంలా హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఖాళీ స్థలంలో మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించడం ప్రధానమని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
సూర్యపేల జిల్లాలోని 65వ జాతీయ రహదారిపై ఉన్న మొక్కలను చూసిన సీఎం కేసీఆర్ సంతోషపడ్డారని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం దృష్టి, ప్రజల భాగస్వామ్యం అయితే అభివృద్ధికి నిదర్శనమే 65వ జాతీయ రహదారి వెంబడి ఉన్న చెట్లని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న భూభాగంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా కేవలం 4 శాతమే ఉన్నందున మొక్కలు ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో తంగేడు వనంలా మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.