ఇంటర్‌లో 45% ఉంటేనే లాసెట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2020-12-15T08:16:20+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి, ఫెయిలైనవారికి కనీస మార్కులు (35 శాతం) వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించిన

ఇంటర్‌లో 45% ఉంటేనే లాసెట్‌ కౌన్సెలింగ్‌

35 శాతం మార్కులతో కుదరదంటోన్న ‘బార్‌ కౌన్సిల్‌’ 

డిగ్రీని బీసీఐ అంగీకరించకపోవచ్చు

అంగీకార పత్రం ఇస్తేనే విద్యార్థులకు అనుమతి

సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం  

హైదరాబాద్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి, ఫెయిలైనవారికి కనీస మార్కులు (35 శాతం) వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయం.. లాసెట్‌ విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఐదేళ్ల  కోర్సులో చేరడానికి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ఇంటర్‌లో విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ నిబంధన ఈసారి సడలించాలని ప్రభుత్వం భావిస్తున్నా.. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఒప్పుకోవడం లేదు.


ఈసారి లాసెట్‌ ఫలితాల్లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో ప్రవేశాలకు 2,477 మంది అర్హత  సాధించారు. డిగ్రీ అర్హతతో మూడేళ్ల ఎల్‌ఎల్‌ బీ కోసం 12,103 మంది అర్హత సాధించారు. వీరంతా ఇంటర్‌/డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంది. డిగ్రీ విద్యార్థులకు ఇబ్బంది లేకపోయినా.. ఇంటర్‌ విద్యార్థులపై మాత్రం ఈసారి ప్రభావం పడనుంది.

ఎందుకంటే ఐదేళ్ల లాసెట్‌లో అర్హత సాధించినవారిలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు సాధించినవారు తక్కువ మంది ఉన్నారు. ఈసారి ఎంసెట్‌ విద్యార్థులకూ ఈ సమస్య ఎదురవడంతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించి అందరికీ అవకాశం కల్పించింది. లాసెట్‌లోనూ ఇలాగే మినహాయింపు ఇస్తారని విద్యార్థులు భావించారు. కానీ, ఇంతవరకు ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేకంగా జీవో విడుదల చేయలేదు. అయితే, 35 శాతం ఉన్నా లాసెట్‌ చేయవచ్చని ప్రభుత్వం నిబంధనలు వెలువరించినా.. దీనిని న్యాయవిద్యను పర్యవేక్షించే బార్‌ కౌన్సిల్‌ ఆమోదించడం లేదు.  


రిస్క్‌ విద్యార్థులదే..

లాసెట్‌ పూర్తిచేసుకున్నవారు తప్పనిసరిగా బార్‌ కౌన్సిల్‌ వద్ద పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇంటర్‌, డిగ్రీలో కనీస అర్హతకు కావాల్సిన 45శాతం మార్కులు, లాసెట్‌లో అర్హత మార్కులను పరిశీలించిన తర్వాతనే ఎన్‌రోల్‌మెంట్‌ చేస్తారు. ఈసారి కనీస మార్కులపై కొత్త సమస్య రావడంతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినా ఆ డిగ్రీని బీసీఐ అంగీకరించకపోవచ్చు. భవిష్యత్తులో తలెత్తనున్న ఈ సమస్యను లాసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ముందే స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు.


భవిష్యత్తులో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని బీసీఐ అంగీకరించకపోతే అధికారులు, ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహించదన్నది దీని సారాంశం. దీనికి పూర్తి బాధ్యత విద్యార్థులదే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడం, అటు బార్‌ కౌన్సిల్‌ సైతం అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో ఎలాంటి స్పష్టత లేకుండానే లాసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. 22 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లు, పేమెంట్‌, సర్టిఫికెట్లను ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంది.


18-22 వరకు ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, వికలాంగ అభ్యర్థులకు స్లాట్‌ బుకింగ్‌, 24న అర్హుల జాబితా విడుదల చేస్తారు. 26, 27న వెబ్‌ ఆప్షన్స్‌, 28న వెబ్‌ ఆప్షన్స్‌ మార్పునకు అవకాశం, 29న ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తారు. 29-31 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌, 31 డిసెంబరు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 2వ విడత కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మొదటిరోజు కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం 252 మంది సర్టిఫికేట్లను అప్‌లోడ్‌ చేశారు.


Updated Date - 2020-12-15T08:16:20+05:30 IST