సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టండి-మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-05-19T01:50:55+05:30 IST

గ్రేటర్‌లో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ పై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టండి-మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్రేటర్‌లో సీజనల్‌ వ్యాధుల నియంత్రణ పై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న శానిటేషన్‌, స్ర్పేయింగ్‌ కార్యక్రమాలను ఐదు రెట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్‌ఎంసి కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీకమిషనర్లు, ఎంటమాలజీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీజనల్‌వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసి ఎంటమాలజీ విభాగంలో ఉన్న 2,412 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, యాంటీ లార్వా ఫాగింగ్‌కు దాదాపు 2,200 యంత్రాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు.


ఆయా జోన్లలో ఉన్న పరిస్థితులను బట్టి స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్ల సహకారంతో అదనపు ఫాగింగ్‌ మిషన్‌ను తెప్పించి ప్రతి ఐదు రోజులకు ఒకసారి చొప్పున నెలకు ఐదు విడతలు యాంటీ లార్వా స్ర్పేయింగ్‌ చేయించాలని జోనల్‌కమిషనర్లను ఆదేశించారు. హైరిస్క్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇంటెన్సివ్‌ శానిటేషన్‌, యాంటీ లార్వా స్ర్పేయింగ్‌ చేయాలని సూచించారు. సోడియం హైపొక్లోరైడ్‌ ద్రావకాన్ని స్ర్పే చేయాలని ఇవిడిఎం విభాగానికి సూచించారు. అలాగే సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని అన్నారు. సర్కిల్‌ స్ధాయిలో కన్వీర్జెన్సీ మీటింగ్‌లు జరపాలని ఆదేశించారు.


అందుకు  అనుగుణంగా ఈనెల 19 నుంచి వారం పాటు కాలనీ, అపార్ల్‌మెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లతో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వమించి దోమలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, చికెన్‌గున్య వ్యాధులపై చైతన్యపర్చాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. మరో నెల రోజుల్లో వర్షాల ఉధృతి పెరుగుతుందని తెలిపారు. అందువల్ల ఇప్పటి నుంచే దోమల నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. కుంటల్లో గుప్రు డెక్కను తొలించేందుకు ప్రతి జోన్‌కు ఒక ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్టర్‌ మిషన్‌ను కేటాయించనున్నట్టు చెప్పారు. రోడ్లపై ఉన్న గుంతలన పూడ్చేందుకు ఇన్‌స్టెంట్‌ రిపేర్‌ టీమ్స్‌ను వెంటనే రంగంలోకి దించాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా వైద్య సిబ్బందితో కలిసి మున్సిపల్‌ సిబ్బంది ,అధికారులు చాలా గొప్పగా పనిచేశారని ఈసందర్బంగా పురపాలకశాఖ పనిచేస్తున్న తీరును అభినందించారు. వ్యాధి చికిత్సకంటే వ్యాధి నివారణే ముఖ్యం కాబట్టి వచ్చే సీజన్‌లో వచ్చే వాయధుల నివారణ కోసం పురపాలక మంత్రి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసి అందరినీ సమాయత్తం చేయడం మంచి పరిణామమని అన్నారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసి , మెట్రోవాటర్‌బోర్డు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈసమావేశంలో మేయర్‌ బొంతురామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసి కమిషనర్‌లోకేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-19T01:50:55+05:30 IST