ట్విట్టర్‌ సందేశానికి తక్షణమే స్పందించిన కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-04-07T15:04:57+05:30 IST

ట్విట్టర్‌ ద్వారా వచ్చిన విన్నపానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తక్షణమే స్పందించారు.

ట్విట్టర్‌ సందేశానికి తక్షణమే స్పందించిన కేటీఆర్‌

ఎంజీ రోడ్డులోని 15 మంది మరాఠా ఉద్యోగులకు బాసట


సికింద్రాబాద్‌/హైదరాబాద్ : ట్విట్టర్‌ ద్వారా వచ్చిన విన్నపానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తక్షణమే స్పందించారు. మహారాష్ట్రకు చెందిన 15 మంది సికింద్రాబాద్‌ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. కరోనా నివారణలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వారు కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని తాము పని చేసే బ్యాంకు మేనేజర్‌ రాజ్‌కమల్‌శర్మకు విషయాన్ని తెలిపారు. దీంతో సదరు మేనేజర్‌ తమ వారిని ఆదుకోవాలని మహారాష్ట్ర నుంచి ఆదివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన కేటీఆర్‌ వెంటనే సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ కార్యాలయానికి సమాచారం అందించారు. మంత్రి కార్యాలయం సిబ్బంది ఎంజీ రోడ్డు ప్రాంతానికి చెందిన రాంగోపాల్‌పేట్‌ కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణాశ్రీనివా‌స్‌గౌడ్‌తో సోమవారం ఉదయం మాట్లాడారు. 


వెంటనే కార్పొరేటర్‌, ఆమె అనుచరులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డులో ఉంటున్న ఆ వ్యక్తుల వద్దకు భోజనం తీసుకుని వెళ్లారు. అయితే.. వారు తమకు భోజనం కాకుండా.. రొట్టెల పిండి, నూనె, తదితర సామాగ్రి ఇస్తే పుణ్యం ఉంటుందని అభ్యర్థించారు. దాంతో కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణాశ్రీనివా‌స్‌గౌడ్‌ పిండి, నూనె తదితర వస్తువులను సమకూర్చారు. ఈ విషయాన్ని వారు మహారాష్ట్రలోని తమ మేనేజర్‌కు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, స్థానిక కార్పొరేటర్‌ అరుణాశ్రీనివా్‌సగౌడ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మహారాష్ట్ర నుంచి ఆ మేనేజర్‌ మరోసారి ట్వీట్‌ చేశారు.  



Updated Date - 2020-04-07T15:04:57+05:30 IST