అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్లు
ABN , First Publish Date - 2020-03-16T09:18:52+05:30 IST
రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నామని, వాటిని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 2 నుంచి టీఎస్-బిపాస్
‘మిషన్ హైదరాబాద్’తో విశ్వనగరం
నాలుగు విప్లవాలు చూడబోతున్నాం
శాసనసభలో పద్దులపై చర్చలో కేటీఆర్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నామని, వాటిని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ఆదివారం వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తన శాఖల పద్దులపై మంత్రి వివరణ ఇచ్చి, ఆమోదించాల్సిందిగా సభను కోరారు. రాష్ట్రంలోని ప్రధానమైన 141 పట్టణాలకు మాస్టర్ ప్లాన్‌ల మ్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా వీధి దీపాలు, మురుగునీటి కాల్వలు, రోడ్లు, పార్కులు, పార్కింగ్ స్థలాలు, డంప్ యార్డులు.. ఇలా మొత్తం 42 అంశాల చెక్‌లిస్టును పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తిగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి కొత్తగా ‘హైదరాబాద్ ఆగ్లోమెరేషన్ స్కీమ్’ను ప్రవేశపెట్టి, రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ చుట్ట పక్కల ప్రాంతాల కోసం షా కన్సల్టెన్సీ సంస్థ సీవరేజీ ప్లాన్‌ను రూపొందిస్తుందని తెలిపారు. ‘మిషన్ హైదరాబాద్’ పేరిట పనులు చేపట్టి విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భవనాల అనుమతుల కోసం టీఎస్-బీపాస్‌ను ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామన్నారు. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్లను పెంచే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉందని, దృఢచిత్తం కలిగిన ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకే పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు.
గొర్రెల పంపిణీ ద్వారా మాంస ఉత్పత్తులు పెరగడంతో పింక్ విప్లవం, చేపల పెంపకం ద్వారా నీలి విప్లవం, పాడి పరిశ్రమ ద్వారా శ్వేత విప్లవం, పంటల ఉత్పత్తి ద్వారా హరిత విప్లవాలను చూడబోతున్నామని వివరించారు. ఇక ఐటీ రంగం దూసుకుపోతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని ఆపడానికి ఒక ఎంపీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ క్లబ్బులు, పబ్బులు లేవని, ఉన్నవి కూడా నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయని చెప్పారు.
మద్యం షాపులను పెంచలేదని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి షాపులే కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని లక్నవరం, బొగత జలపాతం, తాడ్వాయి తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.83 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు హర్షిస్తున్నారని, అందుకే ఈ టెర్మ్, ఆ టెర్మ్ అని కాకుండా ఏ టెర్మ్ అయినా కల్వకుంట్ల టెర్మేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే కార్మికులకు అన్ని రకాల ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. మేస్త్రీలుగా ఉన్నవారు ఇప్పుడు బిల్డర్లు అయ్యారన్నారు. రాష్ట్రంలోని దేవాదాయ భూములను పరిరక్షిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 80 వేలకు పైగా ఆలయ భూములున్నాయని, 40ు వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయని వివరించారు. భూముల పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.