కాపీ కొట్టారు
ABN , First Publish Date - 2020-11-27T07:20:06+05:30 IST
బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో పాటు ఫొటోలూ తమవేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

మా మేనిఫెస్టో మక్కికి మక్కీ
ఫొటోలు మావి.. పోజులు మీవా?
కాపీ కొట్టడానికీ తెలివి ఉండాలి
బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్ విమర్శ
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో పాటు ఫొటోలూ తమవేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందని, మక్కికి మక్కీ దింపిందని ఆరోపించారు. ఆరేళ్లలో తాము చేసిన కార్యక్రమాలను బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిందని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.
‘‘బీజేపీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలతో పాటు ఫొటోలూ మావే. ఫొటోలు మావి. పోజులు మీవా?’’ అని మండిపడ్డారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రచారానికి పక్క రాష్ట్రాల నేతలను అరువు తెచ్చుకున్న బీజేపీ.. మేనిఫెస్టోలోని హామీలూ అరువు తెచ్చుకున్నవేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రణాళికనే సొంతంగా రాయలేని వారు, హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించగలుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్యాకేజీలన్నీ డొల్ల అని, ఇప్పుడు మరో ప్యాకేజీ అంటూ హైదరాబాదీల చెవుల్లో కమలం పువ్వు పెడుతోందని అన్నారు.
తమ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిన మెట్రోరైల్ ప్రాజెక్టు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, టాయిలెట్ల నిర్మాణం, తదితర ఫొటోలను బీజేపీ మేనిఫెస్టోలో ఉపయోగించారన్నారు. తమ ఫొటోలు పెట్టి టీఆర్‌ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి ప్రజలకు బీజేపీ గుర్తుచేసిందని తెలిపారు. మార్పు కోసం బీజేపీ అంటూ మేనిఫెస్టో విడుదల చేసిన ఆ పార్టీ.. ఏం మార్పు కోరుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరవాసులకు బీజేపీ మార్కు మార్పు ఏమాత్రం అవసరం లేదన్నారు.
వ్యాక్సిన్ ఫీజులు వసూలు చేస్తారు
బీజేపీకి ఓటు వేస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని చేసిన హామీని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘‘కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే ఛార్జీలు వసూలు చేసిన ఘనత బీజేపీది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత వ్యాక్సిన్ కోసం ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తుంది. ఆ మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని, అసత్యాలను, ఆచరణ సాధ్యం కాని హమీలను ప్రజలు గమనించాలి’’ అని కేటీఆర్ అన్నారు.
‘బీజేపీ మేనిఫెస్టో రచయితలారా? టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన పనుల ఫొటోలను మీ మేనిఫెస్టోలో పెట్టడం సంతోషంగా ఉంది. వాటిని మేం అభినందనగా తీసుకుంటున్నాం. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి’ అని ట్వీట్ చేశారు.