ఆదుకొంటాం

ABN , First Publish Date - 2020-04-25T07:57:13+05:30 IST

కరోనా ప్రభావంతో ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నా.. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఆదుకొంటాం

‘లక్ష్మీపూర్‌’ ఘటన దురదృష్టకరం: కేటీఆర్‌

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంట నష్టం పరిశీలన  

కంటతడి పెట్టిన రైతులు.. ఓదార్చిన మంత్రి

పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

కాళేశ్వరం తొలి ఫలాలు దక్కింది సిరిసిల్లకే: కేటీఆర్‌


సిరిసిల్ల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్నా.. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.  రైతుల కోసం ప్రభుత్వం ఇంత చేస్తున్నా.. అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు, కోనరావుపేట, వీర్నపల్లి మండలాల్లో అకాల వర్షంతో నష్టపోయిన పంటను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు కేటీఆర్‌ ఎదుట కంటతడి పెట్టడంతో వారిని ఆదుకుంటామని భోరోసా ఇచ్చారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులుఽ ధాన్యానికి నిప్పంటించిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లర్లు కుమ్మక్కయి..


క్వింటాకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తూ దోపిడీకి పాల్పడుతుండటంతో రైతులు తమ ధాన్యానికి నిప్పంటించడం, దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడం తెలిసిందే. అయితే రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తున్నా.. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని కేటీఆర్‌ అన్నారు. అగ్గితెగులు, మెడవిరుపుతో ధాన్యంలో తాలు ఎక్కువగా ఉంటోందని, తూర్పారబట్టినా నష్టం జరుగుతోందని మిల్లర్లు చెబుతుండడం వంటి విషయాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సమస్యలపై రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండి సహకరించాలని కేటీఆర్‌ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు.  


రంగనాయకసాగర్‌ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు..

సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్‌ను ప్రారంభించుకున్నామని, దీని ద్వారా సిరిసిల్ల జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మిడ్‌ మానేరు జలాశయం ద్వారా కాళేశ్వరం తొలి ఫలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకే దక్కాయని తెలిపారు. ప్యాకేజీ-9 ద్వారా సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి నీటిని నింపడానికి డిస్ర్టిబ్యూషన్‌ ఫీడర్‌ చానల్‌ పూర్తి చేయాలని, చెరువులు నింపేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-04-25T07:57:13+05:30 IST