భారత్‌ బయోటెక్‌ నుంచి ‘ఇంట్రా నసల్‌’ కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-09-24T08:40:34+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అమెరికాలోని సెయింట్‌ లూయీ్‌సలో ఉన్న వాషింగ్టన్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముక్కు ద్వారా

భారత్‌ బయోటెక్‌ నుంచి ‘ఇంట్రా నసల్‌’ కొవిడ్‌ వ్యాక్సిన్‌

100 కోట్ల డోసుల ఉత్పత్తికి వాషింగ్టన్‌ వర్సిటీతో ఒప్పందం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అమెరికాలోని సెయింట్‌ లూయీ్‌సలో ఉన్న వాషింగ్టన్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముక్కు ద్వారా అందించే(ఇంట్రా నసల్‌) సింగిల్‌ డోస్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ఆ వర్సిటీతో జట్టు కట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్‌ పంపిణీతో ముడిపడిన అవాంతరాలను అధిగమించేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని స్పష్టంచేసింది. ఇందులో భాగంగా అమెరికా, జపాన్‌, ఐరోపా మినహా మిగతా దేశాల్లో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే హక్కులు తమకు దక్కుతాయని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు, మూడో దశల ప్రయోగ పరీక్షలను దేశంలో భారత్‌ బయోటెక్‌ నిర్వహించే అవకాశాలు ఉండగా, వాటికి సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.


హైదరాబాద్‌లోని జెనోమ్‌ వ్యాలీలో ఉన్న కంపెనీ కర్మాగారంలో ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి జరుగుతుందని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. వినూత్న వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీలో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ వేస్తే వ్యాక్సినేషన్‌ వ్యయం తగ్గుతుందని చెప్పారు. వైరల్‌ వ్యాక్సిన్ల తయారీలో కంపెనీకి ఉన్న సామర్థ్యాలు భద్రమైన, నాణ్యమైన వ్యాక్సిన్లను అందించడానికి వీలు కల్పించగలవని ఆయన అన్నారు. సింగిల్‌ డోస్‌ వల్ల ఇమ్యునైజేషన్‌ సులభతరం అవుతుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లోని బయోలాజిక్‌ థెరప్యుటిక్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ టి కురియల్‌ అన్నారు. నాసల్‌ డోస్‌ ద్వారా కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించడమే కాక వైరస్‌ విస్తరణను కూడా నివారిస్తుందన్నారు.  

Updated Date - 2020-09-24T08:40:34+05:30 IST