‘బ్లాక్‌’లో కొవిడ్‌ మందులు!

ABN , First Publish Date - 2020-07-15T08:39:24+05:30 IST

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. ఆ వైరస్‌ సోకిన వారి బాధ వర్ణనాతీతం. ఇంతటి విపత్కర పరిస్థితులను కూడా కొందరు మందుల

‘బ్లాక్‌’లో కొవిడ్‌ మందులు!

  • రెమ్‌డెసివిర్‌ సహా కీలక ఔషధాల విక్రయం.. 
  • ధర పదింతలు పెంచి అమ్మకాలు
  • హైదరాబాద్‌లో 8 మంది అరెస్టు 
  • రూ.35.5 లక్షల మందులు స్వాధీనం

హైదరాబాద్: కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. ఆ వైరస్‌ సోకిన వారి బాధ వర్ణనాతీతం. ఇంతటి విపత్కర పరిస్థితులను కూడా కొందరు మందుల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రెమ్‌డెసివిర్‌, ఆక్టెమ్రా, ఫాబిఫ్లూ ఇంజెక్షన్లు, మాత్రలను బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు. కంపెనీ నుంచి డీలర్లకు మాత్రమే సరఫరా అయ్యే ఈ మందులను కొంతమంది చేజిక్కించుకుని దాదాపు పదింతలు ధరలు పెంచేసి అమ్ముకుంటున్నారు. ఈ దందా గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో పాటు చార్మినార్‌ ప్రాంతీయ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌ 8 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. రూ.35.5 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ వివరాలను వెల్లడించారు. 


గొలుసుకట్టు దందా..

ప్రధాన నిందితుడిగా ఉన్న సికింద్రాబాద్‌ నివాసి కె.వెంకటసుబ్రమణ్యం (36) అలియాస్‌ ఫణి స్థానికంగా శ్రీమెడిక్యూర్‌ పోడ్రక్స్ట్‌ పేరిట సర్జికల్‌ వ్యాపారం చేస్తున్నాడు.ఇతడే బ్లాక్‌ మార్కెటింగ్‌కి తెరలేపాడు. ఇంజెక్షన్‌ను రూ.3500 కమీషన్‌ తీసుకుని తన అనుచరుడు సంతో్‌షకుమార్‌ (36)కు విక్రయించేవాడు. ఆ తర్వాత సంతోష్‌ రూ.6వేలు కమీషన్‌ తీసుకుని ముషీరాబాద్‌లో మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న కె.కిశోర్‌ (29), ఫీల్‌ఖానాలో మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు మహమ్మద్‌ షాకెర్‌ (34)లకు విక్రయించేవాడు. వారిద్దరూ కలిసి ఆ ఇంజెక్షన్‌ను రూ.8వేలు కమీషన్‌ తీసుకుని నారాయణగూడకు చెందిన వ్యాపారి రాహుల్‌ అగర్వాల్‌ (29)కు విక్రయించేవారు. రాహుల్‌ మరో రూ.15-18 వేలు లాభం తీసుకుని సైదాబాద్‌లో గుప్తా ఫార్మసీలో పని చేస్తున్న ఫిర్‌దౌజ్‌ (22), తలాబ్‌కట్టా నివాసి, మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు సైఫ్‌ (22) ద్వారా వినియోగదారులకు విక్రయించేవారు. ఇలా రూ.5400 ఎం.ఆర్‌.పీ ఉన్న ఔషధం చివరకు మార్కెట్‌లో రూ.30-40వేల వరకు చేరుతోంది. ఇంజెక్షన్‌ మాత్రమే కాకుండా రాహుల్‌ అగర్వాల్‌ ఢిల్లీకి చెందిన వ్యాపారి గగన్‌ఖురానా (21) నుంచి ఆక్టెమ్రా, ఫాబిఫ్లూ మందులను కూడా అక్రమంగా కొనుగోలు చేసి రెట్టింపు ధరల్లో బ్లాక్‌మార్కెట్‌లో చెయిన్‌ లింక్‌ ద్వారా విక్రయించేవాడు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరానికి చెందిన ఏడుగురితో పాటు ఢిల్లీకి చెందిన వ్యాపారిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. వారి వద్ద నుంచి కోవిఫెర్‌ (రెమ్‌డెసివిర్‌)-51, ఆక్టెమ్రా (టాసిలిజుమాబ్‌) 40ఎంజీ-9, ఆక్టెమ్రా 80ఎంజీ-4, ఫాబిఫ్లూ- 180 స్ట్రిప్‌లు, కొవిడ్‌-19 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు- 100, రూ.55వేల నగదు, 8సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రులు, మెడికల్‌ డీలర్లకు మాత్రమే అమ్మాలని, మందులను అక్రమార్కులు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించడం నేరమని సీపీ అంజనీకుమార్‌ అన్నారు.  నిబంధనల ప్రకారమే మందులను విక్రయించాలని.. నేరుగా విక్రయించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


అధిక ధరలకు అమ్మిన సేల్స్‌మ్యాన్‌ అరెస్టు

పంజాగుట్ట: రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తున్న సిద్ధిఖ్‌ అనే మెడికల్‌ షాపు సేల్స్‌మ్యాన్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో   మెహదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతడికి రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అవసరమని వైద్యులు సూచించారు.  దీంతో అతడి స్నేహితుడు  సికిందర్‌ ఇంజక్షన్ల కోసం నిమ్స్‌ సమీపంలో ఉన్న ఓ మెడికల్‌ షాపునకు వెళ్లాడు. మూడు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు కావాలని అడిగాడు. . సికందర్‌ను బయట నిలబడాలని సిద్ధిఖ్‌ అనే సేల్స్‌మ్యాన్‌ సూచించాడు. మరో మెడికల్‌ షాపు నుంచి ఇంజెక్షన్లు తెప్పించాడు. సికందర్‌ వద్దకు వెళ్లిన సిద్ధిఖ్‌.. ఇంజెక్షన్ల కొరత ఉందని, తాము చెప్పిన ధర ఇస్తేనే దొరుకుతాయని చెప్పాడు.  అత్యవసరం కావడంతో సికిందర్‌ సరే అన్నాడు. రూ.16,200 అయ్యే మూడు ఇంజక్షన్లకు ఏకంగా రూ.63వేలు తీసుకున్నారు.

Updated Date - 2020-07-15T08:39:24+05:30 IST