నిమ్స్‌లో 150 మందికి ‘కోవ్యాక్సిన్’
ABN , First Publish Date - 2020-11-25T07:44:33+05:30 IST
‘కోవ్యాక్సిన్’ మూడో దశ ప్రయోగ పరీక్షలు నిమ్స్‌లో చురుగ్గా జరుగుతున్నాయి.

హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్’ మూడో దశ ప్రయోగ పరీక్షలు నిమ్స్‌లో చురుగ్గా జరుగుతున్నాయి. డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వారం రోజులుగా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 150 మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. మూడో దశలో మొత్తం 700-800 మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు ఇవ్వాలనే లక్ష్యాన్ని వైద్య బృందం పెట్టుకుంది.
ఇందులో భాగంగా రోజు 10-20 మంది కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అనంతరం రెండు, మూడు గంటల పాటు పరిశీలించి, ఆరోగ్యపరంగా మెరుగ్గానే ఉన్నారని నిర్ధారించుకున్నాక ఇంటికి పంపిస్తున్నారు. నిమ్స్‌లో మొదటి దశలో 45 మంది, రెండో దశలో ఐదుగురిపై జరిపిన వ్యాక్సిన్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని వైద్యవర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో యాంటీబాడీల వృద్ధి, రోగ నిరోధక శక్తి పెరిగిన తీరు ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించారు.