పురిటి నొప్పులతో ఆస్పత్రికొస్తే నో!
ABN , First Publish Date - 2020-07-04T09:00:04+05:30 IST
అది కోఠీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి. పురుటి నొప్పులతో బాధపడుతూ ఇద్దరు.. నెలలు నిండటంతో 28మంది, మొత్తం 30మంది
- ఎక్కడెక్కడి నుంచో వస్తే చేర్చుకోవాలా?
- మీ ప్రాంతాల్లోనే చేరండి..
- కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యుల నిర్వాకం
మంగళ్‌హాట్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అది కోఠీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి. పురుటి నొప్పులతో బాధపడుతూ ఇద్దరు.. నెలలు నిండటంతో 28మంది, మొత్తం 30మంది గర్భిణులు శుక్రవారం ఆస్పత్రికి వచ్చారు. అయితే పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. రిజిస్ట్రేషన్ కార్డు ఇవ్వాలని 28 మంది గర్భిణులు కోరితే.. ‘‘ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారిని ఆస్పత్రిలో చేర్చుకోవాలా? మీ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లండి’’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. తొలుత ఇద్దరు గర్భిణులు పురిటినొప్పులతో ఆస్పత్రికి రాగా వారిని అత్యవసర విభాగానికి వెళ్లి, రిజిస్ట్రేషన్ చేసుకొని కార్డు తీసుకొస్తేనే అడ్మిట్ చేసుకుంటామని చెప్పారు. వారు రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్దకెళ్లగా అక్కడి సిబ్బంది ఎమర్జెన్సీకి రిజిస్ట్రేషన్ అవసరం లేదని మళ్లీ అత్యవసర విభాగానికి తిప్పి పంపించారు.
ఇలా దాదాపు మూడుసార్లు అటు ఇటూ తిప్పడంతో బాధితుల బంధువులు ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దరు గర్భిణులను అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు. ఇదంతా చూసి ఓపీ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నెలలు నిండిన గర్భిణులు 28 మంది రేప్పొద్దున తమ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని భావించి.. తమకు వెంటనే రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేయాలని పాలకవర్గాన్ని కోరారు. అత్యవసరమైతేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని రిజిస్ట్రేషన్ కార్డులు ఇచ్చేది లేదని వారు తెగేసి చెప్పారు. బాధితులు ఆందోళనకు దిగడంతో సెక్యూరిటీ గార్డులతో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేయగా ప్రధాన గేటు వద్దే నిరసన తెలిపారు. తమకు రిజిస్ట్రేషన్ కార్డులు మంజూరు చేసే వరకు వెళ్లేది లేదని అక్కడే కూర్చున్నారు.
సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకొని గర్భిణులను సముదాయించి ఆస్పత్రి ప్రాంగణంలో కూర్చునేందుకు అనుమతించారు. ఓ గంట తరువాత కార్డులు మంజూరు చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పడంతో గర్భిణులు శాంతించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆస్పత్రి ముందు నిరీక్షించినప్పటికీ కార్డులు మంజూరు చేయలేదు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో నీరసంగా ఉందని తమకు కార్డులు మంజూరు చేసేలా చూడాలని పోలీసులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో మధ్యాహ్నం3 గంటల తర్వాత గర్భిణులు నిరాశగా వెనుదిరిగారు. కార్డులిప్పిస్తానన్న సూపరింటెండెంట్ లోపలికి నుంచి బయటకు రాలేదు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి కార్డులు అడుగుతున్నారు
ఎక్కడెక్కడి నుంచి వచ్చి కార్డులు అడుగుతున్నారు. అత్యవరం అయితేనే ఎమర్జిన్సీలో అడ్మిట్ చేసుకుంటున్నాము. ఒక వేళ అడ్మిట్ చేసుకోకుంటే 100 ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు.
ఆర్‌ఎంవో దయానంద స్వామి
ఉమ్మనీరు తక్కువగా ఉందన్నారు
మరో రెండు రోజుల్లో నాకు నెలలు నిండుతాయి. స్థానిక ఆస్పత్రిలో చూపించుకుంటే ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పారు. నేను 3వ నెల నుంచి కోఠి ప్రసూతి ఆస్పత్రికి వస్తున్నాను. పురిటి నొప్పులతో వచ్చిన ఇద్దరు మహిళలకు కార్డు లేదని దాదాపు గంట పాటు ఇబ్బంది పెట్టారు. నాకూ ఆ పరిస్థితే వస్తుందన్న భయంతో కార్డు ఇవ్వాలంటూ 4 గంటలుగా ఆస్పత్రి ముందు కూర్చున్నాను.
రేణు (సంతోష్‌నగర్)
ప్రైవేట్‌లో 40 వేలు అడుగుతున్నారు
ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.40 వేలు తీసుకొని డెలివరీ చేస్తున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చూపించుకొని వారు రిఫర్ చేస్తే కోఠి ఆస్పత్రికి వచ్చాను. అయితే నొప్పులు వస్తేనో లేదా అత్యవసరం అయితేనో రావాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్డు ఇవ్వమని కోరినా స్పందించడం లేదు.
సునీత (ఎల్బీనగర్)
బ్లడ్ లేదని పంపితే చూడటం లేదు
రక్తం తక్కువగా ఉందని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి నుంచి కోఠి ప్రసూతి ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు లెటర్ రాసి మరీ పంపినా కనీసం నాడి పట్టుకొని చూడటం లేదు. రక్తం తక్కువగా ఉందని అత్యవసరంగా రక్తం ఎక్కించాలని చెప్పినా కనీసం ఆస్పత్రి లోపలికి అనుమతించడం లేదు.
దివ్య (వనస్థలిపురం)