ఏడాదిలో భాగ్యనగరికి కొండపోచమ్మ నీళ్లు

ABN , First Publish Date - 2020-05-30T08:32:03+05:30 IST

ఏడాదిలో భాగ్యనగరికి కొండపోచమ్మ నీళ్లు

ఏడాదిలో భాగ్యనగరికి కొండపోచమ్మ నీళ్లు

కేశవపూర్‌ పూర్తవ్వకముందే జలాలు

బొమ్మరాసిపేట నుంచే నగరానికి సరఫరా

ఏడాదిలో పనుల పూర్తికి నీటిబోర్డు కృషి


హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో సువర్ణ అధ్యాయంగా నిలిచిన కొండపోచమ్మలోకి పరుగులు తీస్తున్న గోదావరి జలాలు హైదరాబాద్‌ జంటనగరాలకూ అందనున్నాయి. ఆ దిశలో హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భాగ్యనగరి అవసరాలను హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జంటజలాశయాలు తీర్చాయి. కొంతకాలానికి మంజీరా నీరు ఆదుకుంది. ఆ తర్వాత దశలవారీగా కృష్ణా జలాలు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత గోదావరి నీళ్లు సరఫరా అవుతున్నాయి. అయితే.. కృష్ణా, గోదావరి నీటి కోసం వేల మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించి, పంపింగ్‌ చేయాల్సి ఉంటుం ది. హైదరాబాద్‌కు మరో 10 టీఎంసీలు అందితే.. ఎలాంటి సమస్య ఉండదని భావించిన సీఎం కేసీఆర్‌.. కేశవపూర్‌ రిజర్వాయర్‌, దండు మల్కాపురం వద్ద మరో జలాశయాన్ని ప్రతిపాదించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎలాంటి పంపింగ్‌ అవసరం లేకుండానే.. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్నాయి. కేశవపూర్‌ రిజర్వాయర్‌ పనులకు భూసేకరణ సవాల్‌గా మారింది. ఆ రిజర్వాయర్‌ పూర్తికాకున్నా, కొండపోచమ్మ రిజర్వాయర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మరాసిపేట వద్ద నీటిని శుద్ధి(172 మిలియన్‌ గ్యాలన్ల సామర్థ్యంతో) చేసి, నగరానికి తరలించనున్నారు. కేశవపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2346కోట్లు కాగా, దానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న బొమ్మరాసిపేట వద్ద నీటిశుద్ధి కేంద్రం, పైపులు, మోటార్లు, పంపుల కోసం రూ.1221కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. బొమ్మరాసిపేట నుంచి శామీర్‌పేట మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు పైపులైన్లను ఏర్పాటు చేసి, రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌కు కలుపుతారు. దీంతో.. సుదూర ప్రాంతమైన ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపు అవసరముండదు.

Updated Date - 2020-05-30T08:32:03+05:30 IST