హైదరాబాద్‌లో కరోనాపై కేంద్రమంత్రి ప్రచారం

ABN , First Publish Date - 2020-12-28T16:17:27+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని

హైదరాబాద్‌లో కరోనాపై కేంద్రమంత్రి ప్రచారం

హైదరాబాద్ : కరోనా సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం యూసు‌ఫ్‌గూడ బస్తీ వద్ద ఆయన ప్రజలకు మాస్క్‌లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ రెస్టారెంట్‌ నుంచి గణపతి కాంప్లెక్స్‌ వరకూ నడుచుకుంటూ ప్రతి దుకాణం, ఇల్లు, దారిలో కనిపించిన వారిని ఆపి మరీ మాస్క్‌లు అందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అడుగులు పెట్టబోతుండగా.. యూరోప్‌ దేశాలలో వెలుగుచూసిన కరోనా పరిణామాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయన్నారు. ఆయా దేశాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో ముందుగానే జాగ్రత్త వహించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సూచించిందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోందన్నారు. కొన్ని దేశాల విమాన సర్వీసులు రద్దు చేసిందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి మాస్క్‌లు ధరించటం, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం మరిచిపోవద్దని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గౌతంరావు, దీపక్‌రెడ్డి, గంగరాజు, ప్రేమ్‌కుమార్‌, జ్ఞానేశ్వర్‌, పులిరాం, సతీష్‌ పాల్గొన్నారు.Updated Date - 2020-12-28T16:17:27+05:30 IST