పోలీసుల అదుపులో కిడ్నాపర్లు ?

ABN , First Publish Date - 2020-10-21T09:26:30+05:30 IST

యాదాద్రి జిల్లా భువనగిరి బస్టాండులో తల్లికి మత్తు మందు ఇచ్చి కుమార్తెను కిడ్నాప్‌ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.

పోలీసుల అదుపులో కిడ్నాపర్లు ?

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో చిన్నారి విక్రయానికి యత్నం

తల్లి ఒడికి చేరిన చిన్నారి


భువనగిరి టౌన్‌, అక్టోబరు 20: యాదాద్రి జిల్లా భువనగిరి బస్టాండులో తల్లికి మత్తు మందు ఇచ్చి కుమార్తెను కిడ్నాప్‌ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులు భువనగిరి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల మహేశ్వరి ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లిన తన భర్త రాజును వెతుక్కుంటూ సోమవారం ఉదయం ఎంజీబీఎ్‌సకు చేరుకుంది. అక్కడ ఉన్న ఓ ముఠా సభ్యులు.. ఆమెకు భర్త ఆచూకీ చెబుతామని నమ్మించి, సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి భువనగిరి బస్టాండుకు తీసుకొచ్చారు. భోజనం పెట్టించి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించారు.


మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. మత్తు వదిలిన అనంతరం మహేశ్వరి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు భువనగిరి, ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్లలోని సీసీకెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. సోమవారం రాత్రి కిడ్నాప్‌ ముఠా సభ్యులు ఆ చిన్నారిని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో దంపతులకు విక్రయించే యత్నం చేశారు. బేరం కుదరకపోవడంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీలతో దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు కిడ్నాపర్లను హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ డిపో సమీపంలో మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికను తల్లికి అప్పగించారు. 

Updated Date - 2020-10-21T09:26:30+05:30 IST