ఖైరతాబాద్ గణపతి 11అడుగులే!
ABN , First Publish Date - 2020-05-13T10:03:23+05:30 IST
ఒక్కో ఏడాది ఒక్కో రూపంతో విశ్వరూప స్థాయి ప్రతిమతో లక్షలాదిమంది భక్తుల పూజలందుకునే ఖైరతాబాద్ మహాగణపతి ఎత్తు ఈసారి కేవలం 11 అడుగులే

- కరోనా ప్రభావంతో ఎత్తు తగ్గించిన కమిటీ
ఖైరతాబాద్ మే 12 (ఆంధ్రజ్యోతి): ఒక్కో ఏడాది ఒక్కో రూపంతో విశ్వరూప స్థాయి ప్రతిమతో లక్షలాదిమంది భక్తుల పూజలందుకునే ఖైరతాబాద్ మహాగణపతి ఎత్తు ఈసారి కేవలం 11 అడుగులే ఉండనుందా..? అవునంటోంది ఉత్సవ కమిటీ. ఈ నెల 18న గణపతి తయారీకై కర్రపూజ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నగర పోలీసులు, అనుమతి ఇచ్చేది లేదని కుండబద్ధలుకొట్టారు. చేసేది లేక కర్రపూజను రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. తొలుత 18 శిరస్సుల విశ్వరూప వినాయకుడిని తయారు చేయాలని సంకల్పించినా.. కరోనా కారణంగా వీలుపడదని భావించామని కమిటీ తెలిపింది.
దీంతో.. తొలినాళ్లలో ప్రతిష్టించిన తామరపువ్వు ఆకార గణపతిని 11 అడుగుల ఎత్తుతో తయారుచేసి పూజలు చేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కార్యదర్శి రాజ్‌కుమార్‌లు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ఎత్తేస్తే భారీ వినాయకుడిని వేగంగా తయారుచేయాలని నిర్ణయించామన్నారు. అలా కాని పక్షంలో కనీసం 11 అడుగుల విగ్రహాన్ని తయారుచేసి లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ పూజలు చేస్తామని సుదర్శన్ వివరించారు. ఎంతో మంది భక్తుల నమ్మకంతో ముడిపడిన ఖైరతాబాద్ గణపతి విషయంలో కొంతమంది సొంత నిర్ణయాలతో మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్ల కమిటీ ప్రతిష్ఠ మసకబారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.