నాగరాజు కేసులో మరికొంత మందికి నోటీసులు
ABN , First Publish Date - 2020-08-20T09:51:39+05:30 IST
కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో మరికొందరికి నోటీసులు పంపాలని

- పంపేందుకు సిద్ధమైన ఏసీబీ
- లంచమిచ్చిన వారిని ప్రశ్నించిన అధికారులు
- స్నేహితుల నుంచి డబ్బు తెచ్చిచ్చామన్న నిందితులు
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో మరికొందరికి నోటీసులు పంపాలని అధికారులు భావిస్తున్నారు. భూతగాదాలో మొత్తం రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్న నాగరాజు.. మొదట కోటి 10 లక్షల రూపాయలు తీసుకోవాలనుకున్నారు. నాగరాజుకు లంచంగా ఇచ్చిన అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రాథమిక విచారణలో శ్రీ సత్య డెవలపర్స్ యజమాని చౌల శ్రీనాథ్ యాదవ్, మధ్యవర్తి అంజిరెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన స్నేహితుడి నుంచి సుమారు 80 లక్షలు, మిగతాది ఇతర స్నేహితుల నుంచి సర్దుబాటు చేసినట్లు వారిద్దరు వెల్లడించారు. డబ్బులు సర్దుబాటు చేసిన వారందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
వారి వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడిది, లెక్కలో ఉన్నదా, లేదా అనే వివరాల్ని విచారణలో వారి నుంచి వివరాలు రాబట్టి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. డబ్బులు ఏ అవసరానికి తీసుకుంటున్నట్లు చెప్పారనే విషయం కూడా విచారణలో రాబడతారు. ఇక జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నాగరాజుతోపాటు, శ్రీనాథ్, అంజిరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించి దర్యాప్తునకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన పత్రాలు నిందితుల వద్ద ఎందుకు ఉన్నాయి? ఎవరి ద్వారా అంజిరెడ్డి వద్దకు ఆ పత్రాలు వచ్చాయి? ఆయా పత్రాలను ఆసరాగా చేసుకుని ఇదివరకు జరిపిన భూలావాదేవీలు ఏమిటీ? భూ వ్యవహారంలో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎంత వరకు ఉందనే వివరాల్ని కస్టడీలో విచారించి రాబట్టనున్నారు. శ్రీనాథ్, అంజిరెడ్డి ఇదివరకే ఇతర ఏ రెవెన్యూ అధికారులకైనా ముడుపులు చెల్లించి పనులు చక్కబెట్టుకున్నారా? అన్న అంశం కూడా కస్టడీలో విచారించనున్నారు.