పైసలిస్తే మార్చేస్తాడు..!
ABN , First Publish Date - 2020-10-03T09:44:33+05:30 IST
గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో దర్యాప్తు

మాజీ తహసీల్దార్ నాగరాజు తీరు.. మళ్లీ కస్టడీకి ఏసీబీ సన్నద్ధం
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. విచారణలో ఏసీబీ అధికారులు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. చిరుద్యోగిగా విధుల్లో చేరిన నాగరాజు.. వరుస పదోన్నతులతో తహసీల్దార్ స్థాయికి చేరుకున్నాడు. డీల్ కుదిరితే.. అడిగినంత ముట్టచెబితే.. మరో ఆలోచన లేకుండా భూముల హక్కుదార్లను మార్చేస్తాడు. రియల్టర్ శ్రీనాథ్‌కు.. గతంలో ధర్మారెడ్డి అనే వ్యక్తి విషయంలోనూ నాగరాజు ఇలాగే వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగరాజు ఉదంతంలో ఏసీబీ అధికారులు ఆయనపై రెండో కేసును నమోదు చేశారు.
లాక్‌డౌన్ సమయంలో ధర్మారెడ్డితోపాటు మరో ముగ్గురికి పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా నాగరాజుకు పెద్దమొత్తంలోనే ముడుపులు అందినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నాగరాజును మరోమారు కస్టడీకి తీసుకుని, విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మారెడ్డి 1996లో రాంపల్లి దయారా గ్రామంలోని 140 ఎకరాలు తనదేనంటూ తప్పుడు ప్రొటెక్ట్ టెనెంట్ (పీటీ) పత్రాలను సృష్టించినట్లు ఆధారాలు సేకరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వహించిన కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్, ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితోపాటు రావువెంకటేశ్వర రావు, సి.వెంకట జగదీశ్వర్‌రావు, సి.భాస్కర్‌రావును కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.