కేసీఆర్.. రైతులతోనా? మోదీతోనా?
ABN , First Publish Date - 2020-12-15T08:58:47+05:30 IST
సీఎం కేసీఆర్ డిల్లీకి వెళ్లి రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతారనుకున్నామని, కానీ మోదీ, అమిత్‌షాల చుట్టూ ప్రదక్షిణలకే పరిమితమయ్యారని సీపీఐ

ఉద్యమాన్ని వ్యతిరేకించే వారంతా దేశద్రేహులు : నారాయణ
ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు: రాఘవులు
కవాడిగూడ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ డిల్లీకి వెళ్లి రైతు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతారనుకున్నామని, కానీ మోదీ, అమిత్‌షాల చుట్టూ ప్రదక్షిణలకే పరిమితమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రైతుల పక్షాన ఉంటారో లేక ప్రధాని వైపు ఉంటారో కేసీఆర్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరల హామీ చట్టం తీసుకురావాలన్న డిమాండ్లతో సోమవారం ఇందిరాపార్కు వద్ద అఖిలభారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించే వారంతా దేశ ద్రోహులన్నారు. కొత్త చట్టాలను రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలు దేశంలోని రైతులకు మరణశాసనాలుగా మారబోతున్నాయన్నారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపకపోవడమంటే.. రైతులను అవమానించడమేననని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. స్వేచ్ఛ మార్కెట్ పేరుతో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.