కేసీఆర్‌ యూటర్న్‌

ABN , First Publish Date - 2020-12-28T07:35:09+05:30 IST

రాష్ట్రంలో తమ సర్కారు తరఫున పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను బంద్‌ చేస్తామని స్పష్టం చేశారు. తమ పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునని కొత్త వ్యవసాయ చట్టాలు చెబుతున్నాయని, అలాంటప్పుడు గ్రామాల్లో

కేసీఆర్‌ యూటర్న్‌

కేంద్ర సాగు చట్టాలకు జై.. కొనుగోలు కేంద్రాలకు నై

కొనుగోలు కేంద్రాలుండవ్‌.. వచ్చే ఏడాది నుంచి బంద్‌ 

పంటలు కొనేందుకు సర్కారు వ్యాపార సంస్థ కాదు

రైస్‌ మిల్లరో.. దాల్‌ మిల్లరో అసలే కాదు

కొనుగోలు, అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు

‘మద్దతు’ కొనుగోళ్ల ద్వారా రూ.7,500 కోట్ల నష్టం

ఎప్పటిలాగే వ్యవసాయ మార్కెట్లలో క్రయ విక్రయాలు

ధర ఎక్కడ ఎక్కువొస్తే అక్కడే పంటలను అమ్ముకోవాలి

కొత్త వ్యవసాయ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి

ఏ పంట వేయాలనేది ఇక రైతుల ఇష్టమే! 

ఇక నుంచి నియంత్రిత సాగు విధానమూ అక్కర్లేదు

నేటి నుంచి యాసంగి రైతుబంధు నిధులు

రాష్ట్రంలో సాగు పథకాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష


రాష్ట్రంలో ఏ రైతు.. ఏ పంటను వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలి. ఈ విధానం ఉత్తమం.

                  -సీఎం కేసీఆర్‌ 


హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తమ సర్కారు తరఫున పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను బంద్‌ చేస్తామని స్పష్టం చేశారు.  తమ పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునని కొత్త వ్యవసాయ చట్టాలు చెబుతున్నాయని, అలాంటప్పుడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అయితే వ్యవసాయ మార్కెట్లలో మాత్రం పంటల కొనుగోలు, అమ్మకాలు సక్రమంగానే జరుగుతాయని పేర్కొన్నారు. గత వానాకాలంలో ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం కూడా ఇక ముందు అమల్లో ఉండదని స్పష్టం చేశారు. రైతులు తమకు ఇష్టం వచ్చిన పంటను వేసుకోవచ్చునని ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ పథకాలపై కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. వివిధ రకాల పంటల కొనుగోలు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు- కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు- ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ఈ ఏడాది గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలా సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.


కాబట్టి వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చునని చెబుతున్నాయి. కాబట్టి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోలు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘రైతులంతా ఒకేసారి కాకుండా.. వంతుల ప్రకారం తమ పంటను మార్కెట్‌కు తీసుకురావాలి. అధికారులు రైతులకు టోకెన్లు ఇవ్వాలి. చెప్పిన రోజు మాత్రమే సరుకును మార్కెట్‌కు తీసుకరావడం వల్ల రైతులకు సౌలభ్యంగా ఉంటుంది’’ అని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. 


ధాన్యం కొనుగోలుతోనే 3,935 కోట్ల నష్టం

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోలు వల్ల చాలా నష్టం జరిగినట్లు సీఎం కేసీఆర్‌కు అధికారులు వెల్లడించారు. ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు, మినుములు తదితర పంటల కొనుగోలు, నిర్వహణ ఖర్చులు కలుపుకొంటే ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు. ఒక్క ధాన్యం కొనుగోలు వల్ల రూ.3,935 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. 


పకడ్బందీగా రైతుబీమా 

రాష్ట్రంలో  రైతుబీమాను పకడ్బందీగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ‘‘రాష్ట్రంలో రైతు బీమా ప్రారంభించిన నాడు కేవలం రూ. 630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్‌ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. ఏడాదికి రూ. 1,144 కోట్లు కట్టాల్సి వస్తోంది. అయినా  ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించింది. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టించాలి. వ్యవసాయ విస్తరణ పనులు చేయాల్సి ఉంది.  ఇవేకాక వ్యవసాయశాఖ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ పనులను చిత్తశుద్థితో పర్యవేక్షించాలి.’’ అని నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి,  కేటీఆర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.


అందరికీ అందేలా..

రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలోని రైతులందరికీ సోమవారం నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల సాగు భూములకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్‌ కోసం ప్రభుత్వం రూ. 7,515 కోట్లు పంటసాయంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.


ఇరిగేషన్‌పై నేడు సీఎం సమీక్ష

నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్షాసమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ శాఖలో చేయదలచిన పునర్విభజన, ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల సమర్పణ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశపు మినిట్స్‌పై రాష్ట్ర వాదన తదితర సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాఖ అధికారులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రి ఏయే అంశాలను సమీక్షిస్తారు? వాటికి సంబంధించిన సమాచారం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. ఇరిగేషన్‌ శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి వీలుగా శాఖను పునర్విభజన చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా సీఎంకు సమర్పించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాళేశ్వరం మూడో టీఎంసీ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికిచ్చే అంశంపై సీఎం సమీక్షించి, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నర్సింహారావు ‘తెలంగాణ డిస్ర్టిక్ట్స్‌ అండ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌’, ‘శ్రీమద్భాగవత కథలు’ పుస్తకాలను రచించారు. వాటిని ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందించారు. తెలంగాణలో తెచ్చిన పరిపాలనా సంస్కరణలు, రెవెన్యూ చట్టాల అమలు తీరుపై ‘తెలంగాణ డిస్ర్టిక్ట్స్‌ అండ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌’లో వ్యాసాలు ఉన్నాయి. రచయిత జ్వాలాను కేసీఆర్‌ అభినందించారు.

Updated Date - 2020-12-28T07:35:09+05:30 IST