కేసీఆర్‌.. ఇదేనా ప్రజాస్వామ్యం!

ABN , First Publish Date - 2020-03-08T09:19:18+05:30 IST

‘‘మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో నల్లగొండ డీసీసీబీ డైరెక్టర్‌ నామినేషన్‌ వేయకుండా మంత్రి నిరంజన్‌రెడ్డి అడ్డుకున్నారు. జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి

కేసీఆర్‌.. ఇదేనా ప్రజాస్వామ్యం!

మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డి దౌర్జన్యం

 నల్లగొండ డైరెక్టర్‌ నామినేషన్‌ను అడ్డుకున్నారు

జీవో 111ను కేటీఆరే ఉల్లంఘించారు: భట్టి

కేటీఆర్‌ ఫాంహౌస్‌ ముట్టడికి  యత్నం 

గచ్చిబౌలి వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో నల్లగొండ డీసీసీబీ డైరెక్టర్‌ నామినేషన్‌ వేయకుండా మంత్రి నిరంజన్‌రెడ్డి అడ్డుకున్నారు. జీవో 111 నిబంధనలను ఉల్లంఘించి మంత్రి కేటీఆర్‌ నిర్మాణాలు చేపట్టారు. ఇదేనా మీ పాలనలో ఉరుకులు పెడుతున్న ప్రజాస్వామ్యం.. శాంతి భద్రతల పరిస్థితి’’ అని సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వారిద్దరితో పదవులకు రాజీనామా చేయిస్తారా? లేదా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భట్టి విక్రమార్క మాట్లాడారు. హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో నల్లగొండ డీసీసీబీ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డిని నామినేషన్‌ వేయకుండా మంత్రి నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అడ్డుకున్నారని, 150 మంది గూండాలను పెట్టి.. ఒకరిని కిడ్నాప్‌ చేయించారని ఆరోపించారు. ఈ విషయాన్ని సభ దృష్టికి తేవడానికి మైకు అడిగితే ఇవ్వలేదన్నారు.


ఒక సభ్యుడిని సస్పెండ్‌ చేయాలంటూ మోషన్‌ మూవ్‌ చేశారని, కానీ సభాపతి అందరి పేర్లూ చదివి బయటకి పంపారని విచారం వ్యక్తం చేశారు. ‘‘సాక్షాత్తూ మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌..  111 జీవో అమల్లో ఉన్న ప్రాంతంలో నిర్మాణం ఎలా చేపడతారు?’’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని ప్రయత్నించిన తమ పార్టీ ఎంపీని అరెస్టు చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మార్క్‌ఫెడ్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకపోవడంపై సభలో ప్రస్తావించేందుకు స్పీకర్‌ అనుమతి కోరామని వెల్లడించారు. శాసనసభ టీఆర్‌ఎ్‌సఎల్పీ మీటింగ్‌లా జరుగుతోందని విమర్శించారు. 


మీడియా పాయింట్‌ నుంచే జన్వాడకు..

మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌.. అక్రమ నిర్మాణమని నిరూపించేందుకు తాము జన్వాడకు వెళ్తున్నామంటూ మీడియా పాయింట్‌లోనే భట్టి ప్రకటించారు. వాస్తవానికి రేవంత్‌రెడ్డి అరెస్టును సీఎల్పీ సమావేశం శుక్రవారమే ఖండించింది. అయితే జన్వాడకు సీఎల్పీ బృందం వెళ్లాలని నిర్ణయించిన అంశాన్ని చివరి వరకూ గోప్యంగా ఉంచారు. కార్లలో జన్వాడకు బయలుదేరిన ఎమ్మెల్యేలను గచ్చిబౌలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య వాగ్వాదానికి దిగారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపా రు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశామని నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపారు.

Updated Date - 2020-03-08T09:19:18+05:30 IST