తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్‌ మౌన ముద్ర

ABN , First Publish Date - 2020-08-02T07:50:18+05:30 IST

కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా..

తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా  కేసీఆర్‌ మౌన ముద్ర

  • ఏపీ సీఎంను ఎందుకు ప్రశ్నించడంలేదు?
  • పోతిరెడ్డిపాడు టెండర్ల పూర్తికే: ఉత్తమ్‌
  • జగన్‌, కేసీఆర్‌ మధ్య చీకటి ఒప్పందం: భట్టి 
  • తెలంగాణ ద్రోహి కేసీఆర్‌: పొన్నాల 
  • ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు: వంశీచంద్‌
  • జగన్‌తో లోపాయికారీ ఒప్పందం: కోదండ

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 11న టెండర్లు పిలుస్తున్నట్లుగా తెలుస్తోందని, ఆ టెండర్లు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే అపెక్స్‌ కమిటీ భేటీ వాయిదా వేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని ఆరోపించారు. శనివారం తన నివాసం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడారు.


కృష్ణానీటిని అడ్డగోలుగా దోచుకుంటున్నా.. ఏపీ సీఎం జగన్‌ను ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ల ద్వారా రోజుకు 6 టీఎంసీల నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోతిరెడ్డిపాడు-రాయలసీమ లిఫ్ట్‌ పథకం పూర్తి అయితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏపీలో టెండర్లు తెరుస్తారని తెలిసీ.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని టీపీసీసీ మాజీ ఛీప్‌ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నుంచి తప్పించుకోవడానికే.. అదే రోజున సీఎం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు.


జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం: కోదండరాం

తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకుపోతోందని, ఇక్కడ సీఎం కేసీఆర్‌ నీళ్లు నములుతూ కూర్చున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 


ఉత్తమ్‌ మోకాలికి గాయం

ఇటీవల తన ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మోకాలికి గాయం అయింది. మోకాలి లిగ్మెంట్‌ దెబ్బ తినడంతో.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.

Updated Date - 2020-08-02T07:50:18+05:30 IST