ఆ ప్రాజెక్టు ఏపీకి కేటాయించి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసింది: కేసీఆర్

ABN , First Publish Date - 2020-09-14T18:42:37+05:30 IST

హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు సంప్రదాయాలు వేరని, ఎన్టీఆర్‌ హయాంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని ..

ఆ ప్రాజెక్టు ఏపీకి కేటాయించి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసింది: కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు సంప్రదాయాలు వేరని, ఎన్టీఆర్‌ హయాంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం శాసనమండలిలో ముఖ్యమంత్రి రెవెన్యూ బిల్లుపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమిగా వర్గీకరణ చేశామన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం సీలేరు ప్రాజెక్టును ఏపీకి కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు.


రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కోవిడ్‌ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందని తెలిపారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, ఆ రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామన్నారు. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ పేర్కొన్నారు.


భూమిశిస్తును ఎన్టీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా భూమిశిస్తు వసూలు చేయడం లేదని కేసీఆర్ చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది.. సామాన్యుల కోసమేనని ఆయన తెలిపారు. కొందరు చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుబంధు పథకం భూస్వాముల కోసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.11 శాతమేనని చెప్పారు. వీఆర్వోల దుర్మార్గాల నుంచి విముక్తి కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు లంచం ఇవ్వాల్సిన అవసరం రాదన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌ పారదర్శకంగా పనిచేస్తుందని, ఎవరైనా, ఎప్పుడైనా ఓపెన్‌ చేసి చూసుకోవచ్చునని చెప్పారు. తహసీల్దార్లు కూడా ట్యాంపర్‌ చేయలేని విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించడం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-14T18:42:37+05:30 IST