నీ తప్పులను ప్రశ్నిస్తే కరోనా రావాలంటావా?

ABN , First Publish Date - 2020-04-08T09:35:48+05:30 IST

‘‘తమ శత్రువుకు కూడా కరోనా రావద్దని ఎవరైనా కోరుకుంటారు. కానీ సీఎం కేసీఆర్‌... ఆయన చేసిన తప్పుడు పనులను ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కరోనా రావాలని...

నీ తప్పులను ప్రశ్నిస్తే కరోనా రావాలంటావా?

  • కరోనా వ్యాప్తికి నువ్వే బ్రాండ్‌ అంబాసిడర్‌
  • నోటికొచ్చినట్లు మాట్లాడితే సమర్థించాలా?
  • సీఎంపై కేసు పెట్టాలి: రేవంత్‌ 
  • ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా వ్యాప్తి: భట్టి 
  • కరోనాపై పెట్టిన ఖర్చేంతో చెప్పాలి: ఉత్తమ్‌ 
  • వార్తల్లో వాస్తవాలు గ్రహించాలి: జగ్గారెడ్డి
  • ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతోనే 
  • ఉద్యోగుల జీతాల్లో కోత: కోమటిరెడ్డి


హైదరాబాద్‌, బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘‘తమ శత్రువుకు కూడా కరోనా రావద్దని ఎవరైనా కోరుకుంటారు. కానీ సీఎం కేసీఆర్‌... ఆయన చేసిన తప్పుడు పనులను ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కరోనా రావాలని అంటున్నడు. ఈ రకంగా ప్రజలకు ఏం సంకేతం ఇవ్వదల్చుకున్నడు? కరోనా వ్యాప్తికి పరోక్షంగా బ్రాండ్‌అంబాసిడర్‌ లాగా కేసీఆర్‌ మాట్లాడుతున్నాడు’’ అని  కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కరోనా రావాలంటూ మీడియా సంస్థలు, ప్రతినిధులపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రేవంత్‌ తీవ్రంగా ఖండించారు. మంచి సలహాలు ఇచ్చినోళ్లకు కరోనా రావాలంటూ మాట్లాడినందుకు కేసీఆర్‌పై కేసు పెట్టాలని డీజీపీని కోరారు. కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తుంటే  ఆయనకు ఇరు పక్కలా కూర్చున్న డీజీపీ, సీఎస్‌... గాడిదలు కాస్తున్నారా అని దుయ్యబట్టారు. పేదలకు నిత్యావసర వస్తువులను అందించనున్న రేవంత్‌ రెడ్డి మంగళవారం వాటికి సంబంధించి ప్యాకింగ్‌ పనులను జూబ్లీహిల్స్‌ కంట్రోల్‌ రూపంలో పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘పారాసిటమాల్‌ వేసుకుంటే కరోనా పారిపోతుందని మొదట్లో చెప్పావు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత ఇది భయంకరమైన వ్యాధి.. మొత్తంగా నిర్బంధించాలన్నావు. అప్పుడూ చప్పట్లు కొట్టాలి.  ఏప్రిల్‌ ఆరు తర్వాత కరోనా కనిపించదని మరోసారి అన్నావు. మళ్లీ ఇప్పుడు జూన్‌ 3 అంటున్నవు. ప్రతిసారీ నువ్వు నోటికొచ్చింది మాట్లాడితే మేము సమర్థించుకుంటూ పోవాలా? ’’ అంటూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.  


తెలంగాణ.. కేసీఆర్‌ జాగీరు కాదు

‘‘కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో లోపాలను గుర్తించి వార్తలు రాస్తే మీడియాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం  ఏమిటి? వారికి కరోనా రావాలని కోరుకుంటావా? దీంతోనే నీ హృదయం ఎంత విశాలమైనదో తేలిపోయింది’’ అని సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. పాలకునికి ఉండాల్సిన లక్షణం ఇది కాదని, పాలకుడిగా ఉండడానికి ఆయన అర్హుడు కాడన్నారు. రాష్ట్రం ఆయన జాగీరు కాదని, అందరికీ బాధ్యత ఉంటుందన్నారు.  అసలు కరోనా విజృంభించడానికి కారణం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ అయినా.. ఇలాంటి సమయాల్లో విమర్శలు చేయవద్దనుకున్నామని, సోమవారం సీఎం కేసీఆర్‌ మాటలు విన్నాక స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం కేసీఆర్‌లు మార్చి 22 వరకూ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తమకు తెలిసినా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తాము ఏమీ మాట్లాడలేదని, అయితే సీఎం కేసీఆర్‌ ఈ సమస్యను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌.. గంటల తరబడి ప్రెస్‌మీట్‌ పెట్టకుండా రాష్ట్ర ప్రజలకు రెండు పూటలా అన్నం పెట్టాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.


ఈ మేరకు కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశారు. మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మీడియాపైన ఆయన శాపాలు పెట్టకుండా రాసిన వార్తల్లో వాస్తవాలనను గ్రహించాలని ఒక ప్రకటనలో సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల జీతాల్లో కోత విధించిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు ఆయన పాదపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ విధించి 15రోజులు గడిచినా కరోనాను ఎదుర్కొనేందుకు విధుల్లో ఉన్నవారికి పీపీఈకిట్లు ఇవ్వలేదన్నారు.


Updated Date - 2020-04-08T09:35:48+05:30 IST