కేసీఆర్‌ ఓ క్రిమినల్‌.. విజయశాంతి

ABN , First Publish Date - 2020-12-11T08:39:38+05:30 IST

ప్రజల రక్తాన్ని తాగుతూ.. ఉద్యమకారుల శవాలపై నుంచి సీఎం కేసీఆర్‌ పాలిస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని,

కేసీఆర్‌ ఓ క్రిమినల్‌.. విజయశాంతి

నా కంటే గొప్ప నటుడు!

ప్రజల రక్తాన్ని తాగుతున్నారు..కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌

తెలంగాణ అంటే సిద్ధిపేట, గజ్వేల్‌ మాత్రమేనా?: విజయశాంతి 

 హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజల రక్తాన్ని తాగుతూ.. ఉద్యమకారుల శవాలపై నుంచి సీఎం కేసీఆర్‌ పాలిస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని, అతి త్వరలోనే టీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. రెండురోజుల కిందట బీజేపీలో చేరిన ఆమె, గురువారం తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.


‘‘నేను తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్‌ టీడీపీలో ఉన్నారు. అక్కడ మంత్రి పదవి రాకపోవడం వల్లే ఆయనకు తెలంగాణ గుర్తొచ్చింది. కానీ, తెలంగాణమా ఆకాంక్ష. అందుకే, బీజేపీని వీడి సొంత పార్టీ ఏర్పాటు చేశా. బీజేపీని వీడిన నాడు.. తల్లిలాంటి పార్టీని ఎందుకు వీడానా అని ఏడ్చాను. కానీ.. తెలంగాణ కోసం రాక తప్పలేదు’’ అని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు.


‘‘ఇంత జరిగిన తర్వాత 2001లో దొరగారు (కేసీఆర్‌) ఎంటరయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టారు. అందరినీ కలుపుకొనిపోతూ ఉద్యమం చేస్తానని మోసగించారు. తెలంగాణ సమస్యలపై నేను నిజాయితీగా పోరాటం చేస్తున్న సమయంలో నా చుట్టూ తిరిగి, నా పార్టీని విలీనం చేయించుకున్నారు. అంతేకాదు.. ఆయన నాకన్నా గొప్ప నటుడు. అవసరం ఉంటే కాళ్లు లేకుంటే జుట్టు పట్టుకుంటడు’’ అని విమర్శించారు. సిద్ధిపేట, గజ్వేల్‌లకు వేల కోట్ల వరాలు కురిపించిన కేసీఆర్‌.. మిగిలిన రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని విజయశాంతి విమర్శించారు. ఈ అన్యాయంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు.


ఆరేళ్లలో గారడీ మాటలు చెప్పడం, దోచుకోవడం తప్ప ఏం అభివృద్ధి చేశారని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి, ఆయన్ను రెండోసారి కూడా నమ్మారని వ్యాఖ్యానించిన ఆమె.. ఇదే ఇంకో రాష్ట్రంలోనైతే ఆయన్ను నడిరోడ్డుపై నిలబెట్టేవారని అన్నారు. పదవుల కోసం కొట్లాడుకోవడానికే కాంగ్రెస్‌ వారికి సమయం సరిపోవడం లేదని, కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సలది మ్యాచ్‌ ఫిక్సింగని ఆరోపించారు.


తెలంగాణను ఎప్పటికీ తన కుటుంబసభులే పాలించాలని ఆయన కోరుకుంటారు. నీచమైన గేమ్‌ ఆడి కాంగ్రె్‌సను కొట్టారు.. ఇప్పడు బీజేపీని కూడా కొడదామనుకున్నరు. కానీ దేవుడనేవాడున్నాడు. బీజేపీయే ఆయనకు కరెక్ట్‌ పార్టీ’’ అని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల శవాలమీద కేసీఆర్‌ పరిపాలన సాగుతోందన్నారు. వరద బాధితులకు ఎన్నికల ముందు మీ సేవలో దరఖాస్తు చేసుకొమ్మని చెప్పి, ఇప్పుడేమో,, మీచావు మీరు చావండి అని అంటున్నారని మండిపడ్డారు. 


Updated Date - 2020-12-11T08:39:38+05:30 IST