కూలదోసే కుట్ర

ABN , First Publish Date - 2020-10-04T07:34:57+05:30 IST

తాము అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ..

కూలదోసే కుట్ర

ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని బీజేపీ యోచన

గోవా, కర్ణాటకలో అదే చేశారు.. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో విఫలమయ్యారు

చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చా.. అట్లాంటిది కేంద్రానికి లొంగుతానా?

కేంద్రంలోని బీజేపీ పనికిమాలిన సర్కారు 

చెప్పేదాంట్లో 99 శాతం అబద్ధాలే

వ్యవసాయ విద్యుత్తు బిల్లులపై ఒత్తిడి తెచ్చారు

కొత్త రాష్ట్రానికి సాయం అందించలేదు

మన సాయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోలేదు

ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం మరింత తగ్గించే ఆలోచన

ఆస్తుల నమోదుకు గడువు పొడిగించే యోచన

ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం మనదే

జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు 104 సీట్లు

దుబ్బాకలో సర్వే మనకు అనుకూలం

జీహెచ్‌ఎంసీలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు

ప్రజల కోసమే రెవెన్యూ, మునిసిపల్‌ చట్టాలు

3 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు: కేసీఆర్‌ 

ముఖ్యనేతలతో ఆరుగంటలపాటు సుదీర్ఘ భేటీ 


ఇటీవల పార్లమెంటులో వ్యవసాయ, విద్యుత్తు సంస్కరణల బిల్లులకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ నుంచి పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చారు. తెలిసిన చాలా మంది ప్రముఖులతో చెప్పించారు. అయినా రైతులు నష్టపోతారని ఆ రెండు బిల్లులకు మద్దతు ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోలేదు.

- సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తాము అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి, తమ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పన్నాగం ఫలించిందని, రాజస్థాన్‌లో వారి ప్రయత్నాలు చెల్లలేదని.. మహారాష్ట్రలోనూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని కేంద్ర బీజేపీ సర్కారు చూస్తోందని.. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన కేసీఆర్‌, వారికి లొంగుతాడా? అని ప్రశ్నించారు.


కేంద్రంలో బక్వాస్‌ (పనికిమాలిన) సర్కార్‌ ఉందని.. ఆ ప్రభుత్వం చెప్పే వాటిల్లో 99 శాతం అబద్ధాలేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం పట్టడంలేదని..  తెలంగాణ రాష్ట్రం విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ప్రగతి భవన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆరుగంటలపాటు సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎ్‌సపీపీ నేత కె.కేశవరావు, ఇతర ముఖ్య నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడారు.


కొత్త రెవెన్యూ, మునిసిపల్‌ చట్టాల అమలు, వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలను ప్రస్తావించారు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం..  లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) రుసుము మరింత తగ్గించే దిశగా ఆలోచిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా ఉండేందుకుగాను ఎల్‌ఆర్‌ఎస్‌ తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రజలు ఏమనుకుంటున్నారని కేసీఆర్‌ ఆరా తీయగా, సంతృప్తిగా ఉన్నారని పార్టీ ఎమ్మెల్యేలు బదులిచ్చారు. 


ఆరేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది? 

రాష్ట్రానికి గడిచిన ఆరేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగానూ తెలంగాణకు తగిన సహకారం అందించటంలేదని, ఇదంతా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే చేస్తోందని ఆరోపించారు. ‘‘కేంద్రానికి అవసరమైనప్పుడు ఎన్నోసార్లు మనం సహకరించాం. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సమయంలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందుగా మద్దతు ఇచ్చాం. చేసిన సాయాన్నీ కేంద్రం గుర్తుపెట్టుకోలేదు. మనం పెట్టుకున్న నమ్మకాన్నీ నిలబెట్టుకోలేదు’’ అని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో  రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కేటాయింపును ఖరారు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ట్రైబ్యునల్స్‌ లేదా విభజన చట్టం మేరకు కేటాయింపులు చేయాలనే తమ అభ్యర్థనను పట్టించుకోవటంలేదని చెప్పారు.


పొరుగు రాష్ట్రం ఏపీతో ఉన్న వివాదాల పరిష్కారానికీ చొరవ తీసుకోవటంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో పోరాటం తప్ప మరో మార్గంలేదని చెప్పారు. అన్ని చట్టాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, అధికారులను కూడా తన అధీనంలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 


చాలా పనులు చేశాం.. ప్రజలకు చెప్పండి

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సదే విజయమని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. అయినప్పటికీ, ఏ ఎన్నికలనూ ఆషామాషీగా తీసుకోవద్దని, అలసత్వం కూడదని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు కార్యక్రమంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారికి స్పష్టంచేశారు. ‘‘రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు చేయిస్తే చాలు.. గెలిచేస్తాం’’ అని తెలిపారు. చాలా అభివృద్ధి పనులు చేశామని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వాటన్నింటినీ ప్రజలకు చెప్పాలని ప్రజాప్రతినిధులకు నిర్దేశించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి యువత మొత్తం టీఆర్‌ఎస్‌ వైపే ఉంది. ఇప్పటికీ వారంతా మనతోనే ఉన్నారు. కానీ నిరుద్యోగులు, యువకులు, పట్టభద్రులు టీఆర్‌ఎ్‌సకి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.


దీనిని సమర్థంగా తిప్పికొట్టాలి’’ అని అన్నారు. ‘‘దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీలో సర్వేలన్నీ టీఆర్‌ఎ్‌సకే అనుకూలంగా ఉన్నాయి. దుబ్బాకలో మనోళ్లు బాగా పనిచేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఇక్కడి 104 డివిజన్లను గెలుస్తున్నాం. వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్లలోనూ టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యం. అయితే నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటి నుంచే పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇంకా బాగా పనిచేయాలి’’ అని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో డివిజన్లవారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. 


చట్టాలపై ప్రజల్లో భయాందోళనలు తొలగించండి

రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కోసమే కొత్త రెవెన్యూ, మునిసిపల్‌ చట్టాలను తీసుకొచ్చామని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల అమలుపై వారిలో భయాందోళనలు ఉంటే, తొలగించాలని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం మరింత తగ్గించే యోచన ఉందని తెలిపారు. దీనిపై క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సంస్కరించిన ధరణి పోర్టల్‌ను దసరా పండుగ నుంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అవసరమైతే మళ్లీ అసెంబ్లీ సమావేశాలను రెండు, మూడు రోజులపాటు జరుపుకుందామని, చట్టాలకు సవరణలు చేద్దామని అన్నారు.


ఈ మేరకు ఎక్కడికక్కడ ప్రజలకు చెందిన ఆస్తుల క్రమబద్ధీకరణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని చెప్పారు. ఈ క్రమంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పరిష్కరించాలని చెప్పారు. ఆస్తుల నమోదుకు విధించిన గడువును పొడిగించాలని వారు కోరగా, సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని భూ వివాదాలను ప్రస్తావించగా, ముందు క్లియర్‌ టైటిల్‌ ఉన్న ఆస్తులను నమోదు చేయించాలని, తర్వాత వివాదాలను పరిష్కరిద్దామని చెప్పారు. 


మిగిలిన 4 ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ రేపు

మిగిలిన నాలుగు (మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌) ఉమ్మడి జిల్లాల మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం, నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల నేపథ్యంలో మెదక్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నేతలకు ఈ భేటీ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


కొత్త ఎమ్మెల్యేలకు త్వరలో క్లాసులు

కొత్తగా గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు త్వరలో ఓరియంటేషన్‌ క్లాసులు ఉంటాయని సమావేశంలో సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా 2గంటల పాటు మాట్లాడారు. నియోజకవర్గాల్లో వ్యవహారశైలిపై వారికి దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2020-10-04T07:34:57+05:30 IST