ఉమ్మడిగా ఉంటేనే బాగుండేది

ABN , First Publish Date - 2020-03-15T09:32:19+05:30 IST

శాసనసభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

ఉమ్మడిగా ఉంటేనే బాగుండేది

 తెలంగాణ కోసం కొట్లాడినందుకు బాధపడుతున్నా

పార్టీలో జూనియర్లపై విమర్శలు సరికాదు: రాజగోపాల్‌రెడ్డి


హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): శాసనసభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను విన్న తర్వాత రాష్ట్రం ఉమ్మడిగానే ఉంటే బాగుండేదని తనకు అనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గతంలో ఎంపీగా పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రె్‌సతోనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే పార్టీని కరోనా వైర్‌సతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం సీఎంకు లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆదిష్ఠానం నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు.  పార్టీ సరైన నిర్ణయం తీసుకోకుంటే తమదారి తాము చూసుకుంటామని తెలిపారు. రేవంత్‌రెడ్డి విషయంలో పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నాయకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే జూనియర్లను ప్రోత్సహించాల్సింది పోయి.. విమర్శలు చేయడం సరికాదన్నారు. 


నాకెందుకు రైతు బంధు?

వ్యవసాయం చేసే వారికి ఇవ్వండి.. నాకొచ్చే రూ.3 లక్షలు పంచేస్తున్నా

‘‘రైతు బంధు మంచి కార్యక్రమం. వ్యవసాయం చేసే వారికే ఆ సాయం అందాలి. రాష్ట్రంలో 70 శాతం భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కానీ, చాలా మంది పెద్దలకే సాయం చేరుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. నా ఖాతాలోనూ రూ.3 లక్షల రైతు బంధు డబ్బు పడుతోంది. నాకెందుకు రైతు బంధు? అందుకే ఊర్లోని పేద వర్గాలకు పంచుతున్నా’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శాసనసభలో శనివారం వివిధ శాఖల పద్దులపై ఆయన మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతోపాటు ప్రతి పంటకు మద్దతు ధర అందించాలని, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కంటే   బెల్ట్‌ షాపులే చాలా డేంజర్‌ అని అభిప్రాయపడ్డారు. మద్యానికి ప్రజలు బానిసలవుతున్నారని, పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్‌ చెప్పారు. సమ్మె వల్ల నష్టపోయింది ప్రజలు, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలే’ అని పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ జోక్యం చేసుకొని ‘సీఎం కేసీఆర్‌ అలా మాట్లాడలేదు’ అని స్పష్టం చేశారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు ఆగాలంటే మద్యం అమ్మకాలను నియంత్రించాలన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేస్తుండగా... ‘ఏందిరా భయ్‌ రన్నింగ్‌ కామెంట్రీ’ అంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి తలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్‌ పార్లమెంటరీ పదాలను తొలగిస్తామని చెప్పిన స్పీకర్‌.. రాజగోపాల్‌రెడ్డి మైక్‌ కట్‌ చేయగా... కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగారు.  


అందర్నీ కలుపుకెళ్లే వారికే పదవి ఇవ్వాలి

అలాంటి వారిలో నేనే మొదటివాడిని 

బలమైన నాయకత్వం, సామాజిక వర్గం, అందర్నీ కలుపుకుపోయేతత్వం ఉన్న వారినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి లక్షణాలు ఉన్న నాయకుల్లో తానే మొదటివాడిని అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి తాను వ్యతిరేకం కాదని, ఆయన పార్టీలోకి రావడాన్ని తానూ స్వాగతించానన్నారు.  ఎంపీగా ఉన్న వ్యక్తి డ్రోన్‌ కెమెరాతో ఫామ్‌హౌస్‌ ఫొటోలు తీయించడం సరికాదన్నారు. అలాగని.. ఆయన్ను ప్రభుత్వం అరెస్టు చేయించడం దారుణమన్నారు. గోపనపల్లి భూముల వ్యవహారం బయటకు తీసినందుకు జీవో 111ను తీసుకువచ్చారన్న భావన ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందన్నారు. ‘చలో ప్రగతి భవన్‌’ అంటే లక్ష మందితో చేయాలని, ఒక్కరే బైక్‌పై వెళ్లడం సరికాదని అన్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం హిమాయత్‌సాగర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో నిర్మాణాలు జరగకుండా ఆ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం నగరం విస్తృతంగా పెరగడం, కృష్ణా, గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆ జీవో అవసరం లేదన్నారు. 

Updated Date - 2020-03-15T09:32:19+05:30 IST