ఎవడబ్బ సొమ్మూ కాదు: కేసీఆర్
ABN , First Publish Date - 2020-03-13T09:26:59+05:30 IST
ఎవడబ్బ సొమ్మూ కాదు: కేసీఆర్

చిదంబరం సీఎస్టీతో ఎగవేస్తే..
బీజేపీ జీఎస్టీ తెచ్చి రాష్ట్రాలకు ఎగబెడుతోంది
కేంద్రంలో రెండు పార్టీలూ అట్టర్ ఫ్లాప్
దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలు ఐదారే
వాటిలో రెండు మూడు స్థానాల్లో తెలంగాణ
మిగతా రాష్ట్రాలు అడుక్కు తింటున్నాయి
బీజేపీ ఇప్పటికైనా నీచబుద్ధి మానుకోవాలి
కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్
అసెంబ్లీలో... మక్కల మెక్కుడు ప్రస్తావన
‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై రెండు రోజుల చర్చ
‘‘పన్నుల వాటా పొందడమనేది రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు! మీరిచ్చేదేమిటి? కిసీ బాప్‌కా నహీ. పన్నుల వాటా సొమ్ము చెల్లించాల్సిందే. సెంట్రల్ డివల్యూషన్ అని అంటుంటారు. నిజానికి, అది సెంట్రల్ డివల్యూషన్ కాదు. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాల వాటా. రాష్ట్రాల నుంచి ఆదాయ పన్ను, కస్టమ్స్ తదితరాలను కేంద్రం వసూలు చేసి, రాష్ట్రాలకు పంచుతుంది’’ - సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. శాసనసభలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చే సందర్భంలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ లేక లేక అధికారంలోకి వచ్చిందని, అంతకుముందు ఒకసారి ఎన్డీయేగా పాలన సాగించిందని చెప్పారు. కానీ.. తమ టీఆర్‌ఎస్ పార్టీ మొదటిసారి పోటీ చేసి, మొదటిసారే అధికారంలోకి వచ్చిందన్నారు. యూపీఏ ప్రభుత్వం విఫలం కావడంతో బీజేపీవాళ్లేదో ఒరగబెడతారని కేంద్రంలో ప్రజలు అధికారమిచ్చారని ఎద్దేవా చేశారు. 56 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచిందని, కానీ, ఆ రెండు పార్టీలూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. ‘‘గతంలో చిదంబరం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) తెచ్చి రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు ఎగబెట్టాడు. ఇప్పుడు బీజేపీ జీఎస్టీ తెచ్చి ఎగబెడుతోంది. పన్ను వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనైనా 14 శాతంకంటే తక్కువ నమోదైతే.. ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇస్తామన్నారు. దానికి దిక్కు లేదు. ఎప్పుడూ సరిగా ఇవ్వడం లేదు. ఏ రాష్ట్రానికి ఎంతమేర పన్నుల వాటా వస్తుందనేది కేంద్ర బడ్జెట్‌లో పెడతారు. దానిని నమ్ముకుని ఉద్యోగుల జీతాలపై భరోసా ఇస్తాం. కానీ.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే. సెంట్రల్ డివల్యూషన్ కింద రాష్ట్రానికి రూ.3900 కోట్ల భరోసా ఇచ్చారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి’’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. పన్నుల వాటా, కేంద్ర పథకాలు కలిపితే రాష్ట్రానికి ఏనాడూ కేంద్రం రూ.10 వేల కోట్లకు మించి నిధులివ్వలేదని తప్పుబట్టారు. కానీ, కేంద్ర పథకాలకు తాము రాష్ట్ర వాటా కలుపుతున్నామని, దానికి కేంద్రం బాజా కొట్టుకుంటోందని, వీళ్లు కాంగ్రె్‌సవాళ్ల కంటే తాతలైపోయారని బీజేపీపై మండిపడ్డారు. ‘‘దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలు ఐదారే. మిగతా రాష్ట్రాలు అడుక్కు తింటున్నాయి. ఈ ఐదారు రాష్ట్రాల్లో రెండు మూడు స్థానాల్లో తెలంగాణ ఉంది. అన్ని రకాల పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి కేంద్రానికి ఏడాదికి రూ.50 వేల కోట్ల వరకు వెళుతుంటే.. అక్కడి నుంచి రూ.24 వేల కోట్లు దాటి రావడం లేదు’’ అని ధ్వజమెత్తారు. బీజేపీ ఇప్పటికైనా తన నీచ బుద్ధిని మానుకుంటే మంచిదని హితవు పలికారు. కేంద్ర హోం మంత్రి రాష్ట్రానికి వచ్చి ఇంతిచ్చాం, అంతిచ్చాం అని అన్నారని, దాంతో, తాను చెప్పే లెక్కలు తప్పయితే క్షమాపణ చెబుతానని అన్నానని గుర్తు చేశారు.
పౌల్ట్రీని ఆదుకోవాల్సిందే
రాష్ట్రంలో 25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న పౌలీ్ట్ర రంగాన్ని ఆదుకోవాల్సిందేనని, అవసరమైతే రూ.200 కోట్లు కేటాయించినా ఇబ్బంది లేదని కేసీఆర్ చెప్పారు. మక్కల విక్రయాల్లో కుంభకోణం జరిగిందంటూ కాంగ్రె్‌సపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. నిజానికి, కరోనా భయం లేకపోతే రాష్ట్రం నుంచి లక్షలాది కోళ్లు, కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవని తెలిపారు. ‘‘ఈ పరిశ్రమపై 25 లక్షల మంది ఆధారపడ్డారు. దీనిని ఆదుకోవడానికే పౌలీ్ట్ర పరిశ్రమకు మక్కలు ఇచ్చాం. లేకపోతే.. పౌలీ్ట్ర రైతులు, ఫెడరేషన్ వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి మక్కలను కొనుక్కుంటారు. మక్కల విక్రయాల్లో కుంభకోణం లేదు, లంభకోణం లేదు’’ అని కొట్టిపారేశారు. పౌలీ్ట్ర రంగంపై ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రె్‌సకే మైనస్ అవుతుందని అన్నారు. ‘‘దీనిపై అసలు కాంగ్రెస్ వాళ్లకు సరైన అవగాహన లేదు. ఈటల రాజేందర్‌కు ఆ పార్టీకి చెందిన నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఫోన్ చేసి, మావాళ్లు (కాంగ్రెస్) తప్పు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదో అర్థం చేసుకోవడం లేదు. మీ పద్ధతి మారాలి’’ అని హితవు పలికారు.
అసెంబ్లీ వద్ద భద్రత పెంపు
అసెంబ్లీ వద్ద భద్రతను పెంచారు. ఏబీవీపీ, పీడీఎ్‌సయూ విద్యార్ధులు బుధవారం ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసుల వలయాన్ని చేధించుకొని విద్యార్ధులు ముందుకు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అసెంబ్లీ వద్ద కొనసాగిస్తున్న భద్రతను భారీగా పెంచారు. గురువారం సివిల్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. పీపుల్స్ ఫ్రెండ్లీ నినాదంతో ముందుకెళుతూ లాఠీలను పక్కన బెట్టిన పోలీసులు గురువారం అసెంబ్లీ బందోబస్తు వద్ద పాత పద్ధతిలో పొడవాటి లాఠీ(దండె)లతో విధుల్లో పాల్గొన్నారు.