ముస్లింలకు సీఎం కేసీఆర్‌ దోస్త్‌!

ABN , First Publish Date - 2020-03-12T09:25:25+05:30 IST

ముస్లింలకు సీఎం కేసీఆర్‌ దోస్త్‌!

ముస్లింలకు సీఎం కేసీఆర్‌ దోస్త్‌!

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు దోస్త్‌ అని మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఐదేళ్లలో లక్ష మంది నిరుపేద వధువులకు షాదీ ముబారక్‌ కింద సాయం చేశారని కొనియాడారు. శాసన సభలో బుధవారం బడ్జెట్‌పై చర్చను అక్బరుద్దీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినప్పటికీ విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందడం లేదన్నారు. జిల్లాల వారీగా ఎంత మంది ముస్లింలకు ఆసరా పింఛన్లు అందుతున్నాయో లెక్కలు అందించాలని డిమాండ్‌ చేశారు. మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయడానికి వీలుగా గ్రీన్‌చానల్‌ కిందకు తేవాలని కోరారు. పదే పదే కోరుతున్నా వక్ఫ్‌ భూముల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు.  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల్లో మైనారిటీలు ఒక్క శాతం కూడా లేరని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 20 నెలలుగా ఫిట్‌మెంట్‌ పెండింగ్‌లో ఉందని, వెంటనే ఇవ్వాలని కోరారు. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పులు రూ.3.3లక్షల కోట్లకు చేరనుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అప్పులను ఎలా తీరుస్తారో సీఎం, ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌ అగ్లోమెరేషన్‌ పథకానికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని, అయితే... ఇందులో పాతబస్తీ అభివృద్ధికి రూ.2000 కోట్లు ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు కావాలని తాను పోరాడానని, కానీ... తాను ప్రాతినిధ్యం వహించే పాతబస్తీకి మెట్రో రైలు రాకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికైనా తాము సూచించిన ప్రకారం మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చి శంషాబాద్‌ వరకూ పొడిగించాలన్నారు. 

Updated Date - 2020-03-12T09:25:25+05:30 IST