రక్షణ లేని పారిశుధ్య కార్మికులు!

ABN , First Publish Date - 2020-06-14T08:54:40+05:30 IST

రక్షణ లేని పారిశుధ్య కార్మికులు!

రక్షణ లేని పారిశుధ్య కార్మికులు!

ఇప్పటికీ అందని రక్షణ పరికరాలు

శానిటైజర్‌ కూడా ఇవ్వని వైనం

రెండు మాస్క్‌లిచ్చి చేతులు దులుపుకున్నారు

పెరుగుతున్న కేసులతో కార్మికుల్లో ఆందోళన


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో దేనినైనా ముట్టుకోవాలంటేనే భయపడుతున్నాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులను సబ్బుతో కడుక్కోడమో లేదా శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవడమో తరచూ చేస్తున్నాం. గ్రేటర్‌ పరిశుభ్రత కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. నిత్యం చెత్తను తొలగించే క్రమంలో వైరస్‌ బారిన పడుతున్న కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 8 మంది పారిశుధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే వాదనా ఉంది. శనివారం సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని రాంగోపాల్‌పేటలో ఓ కార్మికురాలికి వైరస్‌ సోకినట్టు తేలింది. రక్షణ పరికరాల ఊసు ప్రకటనలకే పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రక్షణ పరికరాలు ఏవీ?

గ్రేటర్‌లో 20వేల మంది పారిశుధ్య, 3 వేల మంది ఎంటమాలజీ వర్కర్లు ఉన్నారు. పారిశుధ్య కార్మికులు చెత్తా చెదారం తొలగిస్తుండగా... కొవిడ్‌-19 వైరస్‌, దోమల నివారణకు ఎంటమాలజీ విభాగం పని చేస్తోంది. కార్మికులే కాకుండా కార్యాలయాల్లో పని చేసే సిబ్బందీ వైరస్‌ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు, కారికులకు మాస్క్‌లు, శానిటైజర్లు  ఇవ్వాలని నిర్ణయించారు. నెల క్రితం నామ్‌కే వాస్తేగా వాటిని అందజేసి ఆపై ఆ విషయాన్ని విస్మరించారు. ఏడాదికి సరిపడా   మాస్క్‌, గ్లౌస్‌లు, షూస్‌, శానిటైజర్‌, కొబ్బరి నూనె, సబ్బులు, టవల్‌ తదితరాల కొనుగోలుకు టెండర్‌ నిర్వహించారు. కానీ, నెల రోజులు దాటినా అవి కార్మికులకు అందలేదు. మాస్క్‌లు మాత్రమే ధరించి పని చేస్తున్నారు. కార్మికులకు వైరస్‌ సోకడానికి ఇదే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెజారిటీ సర్కిళ్లలో కార్మికులకు శానిటైజర్‌ కూడా అందుబాటులో లేదు. ఒక్కొక్కరికి రెండు క్లాత్‌ మాస్క్‌లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ముషీరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఒకేసారి.. అది కూడా 100-150 మిల్లీలీటర్ల శానిటైజర్‌ బాటిల్‌ మాత్రమే అందజేశారని చెబుతున్నారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని ఓ సర్కిల్‌లోనూ ఇదే దుస్థితి. కేంద్ర కార్యాలయం నుంచి సర్కిళ్లకు శానిటైజర్‌ టిన్‌లు పంపినా.. క్షేత్రస్థాయిలో పంపిణీ చేయకుండా కొందరు డీసీలు నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిసింది. 

Updated Date - 2020-06-14T08:54:40+05:30 IST