కన్నబిడ్డను అమ్మేశారు!
ABN , First Publish Date - 2020-10-31T09:14:07+05:30 IST
ఏమాత్రం కనికరం లేకుండా.. కన్నవాళ్లే నవజాత శిశువుకు రేటు కట్టి విక్రయించిన దారుణమది. ఐదు నెలల క్రితమే ఘటన జరగగా..

ఆడపిల్ల పుడుతుందన్న భయంతోనే!
5 నెలల క్రితం లక్షకు పసికందును విక్రయించిన తల్లిదండ్రులు
తాజాగా గొడవలు రావడంతో తిరిగివ్వాలని డిమాండ్
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. అందరిపైనా కేసులు నమోదు
నాచారం, అక్టోబర్ 30 (ఆంధ్రజ్యోతి): ఏమాత్రం కనికరం లేకుండా.. కన్నవాళ్లే నవజాత శిశువుకు రేటు కట్టి విక్రయించిన దారుణమది. ఐదు నెలల క్రితమే ఘటన జరగగా.. అమ్మిన వారికి, కొన్నవారికి మధ్య గొడవలు రావడంతో తాజాగా వెలుగుచూసింది. నాచారం రాఘవేంద్ర కాలనీలో మీనా, వెంకటేష్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి గతంలో ఇద్దరు ఆడశిశువులు జన్మించి అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం ఓ కుమార్తె ఉంది. గతంలో నాచారంలోనే అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉన్న సమయంలో పొరుగింటిలో ఉన్న నగీమా, రాజేశ్వర్ దంపతులతో వారికి పరిచయమైంది. రాజేశ్వర్ దంపతులకు పిల్లలు లేరు. వెంకటేష్ దంపతుల ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో.. మీనాకు పుట్టే బిడ్డను రాజేశ్వర్ దంపతులకు విక్రయించమంటూ జానకి అనే మహిళ మధ్యవర్తిత్వం నడిపింది. మళ్లీ ఆడబిడ్డ పుడుతుందేమోనన్న అనుమానంతో తమకు పుట్టబోయే బిడ్డను రూ. లక్షకు విక్రయించేందుకు రాజేశ్వర్ దంపతులతో వెంకటేశ్, మీనాలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ మేరకు కొంత అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. మీనా తన పేరును నగీమాగా చెప్పి నాచారం ఈఎ్‌సఐ ఆస్పత్రిలో చేరింది. ఈ ఏడాది జూన్ 19న పండంటి మగ బిడ్డకు మీనా జన్మనిచ్చింది. అనంతరం ఒప్పందం తన బిడ్డను రాజేశ్వర్, నగీమాలకు అప్పగించింది. తర్వాత ఇరు దంపతుల మధ్య వాగ్వాదం తలెత్తడంతో తన బిడ్డను తిరిగి ఇవ్వాలంటూ మీనా డిమాండ్ చేసింది. అందుకు నగీమా అంగీకరించకపోవడంతో.. మీనా, వెంకటేశ్ దంపతులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో మొత్తం తతంగం బయటికొచ్చింది. దీంతో మధ్యవర్తి జానకితో పాటు ఇరు జంటలపై కేసు నమోదు చేశారు. 5నెలల బిడ్డను శిశువిహార్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.