బరువెక్కిన గుండెలతో.. భారమైన అడుగులతో ముల్లెసర్దుకొని ఎల్లిపోతున్నరు

ABN , First Publish Date - 2020-03-02T09:46:58+05:30 IST

పుట్టి.. పెరిగిన ఊరు కన్నతల్లితో సమానం అంటారు. మరి.. ఆ ఊరినే శాశ్వతంగా వదిలేసి వెళ్లాల్సివస్తే? గుండె మెలిపెట్టేసినట్లు అనిపించదూ! కాళేశ్వరం ప్రాజెక్టులోని

బరువెక్కిన గుండెలతో.. భారమైన అడుగులతో  ముల్లెసర్దుకొని ఎల్లిపోతున్నరు

కన్నతల్లిలాంటి ఊరు, అన్నంపెట్టిన భూతల్లిని వదిలేసి పయనం

ఒకరినొకరు హత్తుకొని కన్నీటిపర్యంతం

తరలుతున్న అనంతగిరి ప్రాజెక్ట్‌ నిర్వాసితులు 

సిరిసిల్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పుట్టి.. పెరిగిన ఊరు కన్నతల్లితో సమానం అంటారు. మరి.. ఆ ఊరినే శాశ్వతంగా వదిలేసి వెళ్లాల్సివస్తే? గుండె మెలిపెట్టేసినట్లు అనిపించదూ! కాళేశ్వరం ప్రాజెక్టులోని అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి ఎస్సీ కాలనీ నిర్వాసితులది ప్రస్తుతం ఇదే పరిస్థితి. అనుబంధం పెంచుకున్న ఇంటిని, అన్నంపెట్టిన భూతల్లిని.. తాత ముత్తాతల కాలం నుంచి పెనవేసుకున్న జ్ఞాపకాలను వదిలేసి.. మూటాముల్లె సర్దుకొని బయలుదేరుతుంటే వారికి కన్నీళ్లు ఆగడం లేదు! ‘మల్లెప్పుడు కలుస్తమో అక్కా’ అంటూ మహిళలు ఒకరినొకరు హత్తుకొని భోరున రోదిస్తున్నారు. పరస్పరం ఓదార్చుకొని బరువెక్కిన గుండెలతో భారమైన అడుగులతో అక్కడి నుంచి వెళుతున్నారు. ఈనెల 4, 5 తేదీల్లో సర్జిపూల్‌ మహాబావి నుంచి అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లోకి నీటిని ఎత్తిపోసి రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ వరకు గోదావరి జలాలను తీసుకెళ్లనున్నారు.


అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లోకి నీళ్లు ఎత్తిపోయడానికి తక్షణ ప్రతిబంధకంగా ఉన్న అనంతగిరి ఎస్సీ కాలనీల వాసులను తరలించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ముంపు ప్రాంతమైన అనంతగిరి కొత్త, పాత ఎస్సీ కాలనీల్లో 122 కుటుంబాలున్నాయి. ఇందులో ఆదివారం వరకు 86 కుటుంబాలు తరలివెళ్లాయి. రెండ్రోజుల్లో మిగతా 36 కుటుంబాలు కూడా నిష్క్రమించనున్నాయి. అనంతగిరి ప్రాజెక్ట్‌లో భాగంగా ముంపుతో 837 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. తక్షణ ముంపును ఎదుర్కొంటున్న ఎస్సీ కాలనీల కుటుంబాల తరలింపు ప్రక్రియ పూర్తవుతుండటంతో మిగతా  కుటుంబాల తరలింపుపై అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం తరలిపోతున్న ఎస్సీ కాలనీ కుటుంబాలకు ఇంటి అద్దెలు, ప్రయాణ ఖర్చుల కోసం రూ.50 వేల చొప్పున చెక్కులను అందించారు. ఈ వారంలోనే నీటి ఎత్తిపోతలకు చర్యలు ప్రారంభం కానుండటంతో అనంతగిరి గ్రామ శివారులోని ఎస్సీ కాలనీ వాసుల తరలింపును ముమ్మరం చేశారు.

Updated Date - 2020-03-02T09:46:58+05:30 IST