కాళేశ్వరంపై కనికరమేది..?

ABN , First Publish Date - 2020-10-31T06:35:37+05:30 IST

దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మాటల వరకే పరిమితమయ్యాయి

కాళేశ్వరంపై కనికరమేది..?

హామీలకే పరిమితమైన యాదాద్రి తరహా అభివృద్ధి

ఊసేలేని వంద కోట్ల నిధులు.. వంద ఎకరాల భూ సేకరణ

పర్యాటక అభివృద్ధికి పడని అడుగులు

అసంపూర్తిగా నిర్మాణ పనులు


భూపాలపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ అభివృద్ధిపై  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు మాటల వరకే పరిమితమయ్యాయి.  అర కోటి ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టుకు పుట్టినిళ్లయిన కాళేశ్వరం అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ హమీలు ఇచ్చి ఏడాదన్నర కాలమైనా కార్యరూపం దాల్చలేదు. యాదాద్రి తరహాలో కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోవడం లేదు. ఆలయ అభివృద్ధికి నాలుగేళ్ల క్రితం కేటాయించిన నిధులు సైతం పక్కాదారి పడుతున్నాయి. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 


వందకోట్లు.. వంద ఎకరాల భూసేకరణ

 తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాల నుంచి కాళేశ్వరాలయానికి భక్తులు వస్తుంటారు. గోదావరి, ప్రాణహిత, సర్వస్వతీ నదుల సంగమ ప్రాంతమైన కాళేశ్వర ఆలయాన్ని యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్‌ 2019 మే 19న హామీ ఇచ్చారు. సతీసమేతంగా కాళేశ్వరానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం ఆలయ అభివృద్ధిపై హమీల వర్షం కురిపించారు. 2020-21 బడ్జెట్‌ రూ.100 కోట్ల నిధులను లో కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. వేద పండితులు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మించి ఇస్తామన్నారు. గోదావరి తీరంలో యాగశాలతో పాటు అశ్వశాలలు, వేదా పాఠశాల, కళాశాల భవనాలను ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి వంద ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు భూసేకరణ చేస్తామన్నారు. భూ సేకరణపై అప్పటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లును సైతం ఆదేశించారు. 


పర్యాటక అభివృద్ధిపై..

 కన్నెపల్లి పంపు హౌజ్‌, మేడిగడ్డ బ్యారేజీల వద్ద అతిథి గృహాలు, పర్యాటకుల కోసం హోటళ్లు, గోదావరిలో బోటింగ్‌, హెలిప్యాడ్‌ నిర్మాణాలు చేపట్టి పర్యాటక ప్రాంతాంగా కాళేశ్వరాన్ని తీర్చిదిద్దుతానని కేసీఆర్‌ హమీలు ఇచ్చారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఏ ఒక్కటి అమలు కాకపోగా కరోనాతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గి, ఆలయ ఆదాయం పూర్తిగా క్షిణించింది. దీంతో సిబ్బంది వేతనాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

 

ప్రాజెక్టుపైనే ప్రేమా.. 

 కోట్ల రూపాయాలతో సుమారు 50 లక్షల ఎకరాలకు సాగు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిన ప్రభుత్వం.. కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం అభివృద్ధిపై ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు, ఇళ్లను త్యాగం చేసిన ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం ఇచ్చిన హమీలు నెరవేరకపోవడంపై ఆవేదన చెందుతున్నారు.   ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి బాటలు వేయాలని  విజ్ఞప్తి చేస్తున్నారు.

 

నిలిచిన అభివృద్ధి..

2016, మే 2న  కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలయంలో పూజలు చేసి, ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు కేటాయిస్తున్నటు ప్రకటించారు. అనంతరం పలుసార్లు ఇక్కడికి వచ్చినా అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించలేదు. దీంతో నిధుల కొరత కారణంగా నాలుగేళ్లుగా అభివృద్ధి పనులు నిలిచిపోయి, సగం పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. భక్తుల కోసం నిర్మిస్తున్న 100 వసతి గృహాల నిర్మాణ పనులు అర్ధంతరంగా మిగిలిపోయాయి. పార్వతి మండపం, శపతి మండపం, అభిషేక మండపంతో పాటు ఆదిముక్తీశ్వర స్వామి వద్ద నిర్మించే ఆర్చి గేటు, అన్నదాన గదులు, కర్మలు నిర్వహించే శాత మండపం ఇతర అభివృద్ధి పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయి. 

Read more