కలపా..కలపా.. ఏమయ్యావ్‌..

ABN , First Publish Date - 2020-12-16T04:46:31+05:30 IST

కలపా..కలపా.. ఏమయ్యావ్‌..

కలపా..కలపా.. ఏమయ్యావ్‌..
తండాలో ఆరు బయట వేసిన వ్యవసాయ గిడ్డంగి కర్ర

రూ.10లక్షల విలువైన టేకు కర్ర మాయం

అధికారులే అమ్ముకున్నారా?... ప్రజా ప్రతినిధులు కాజేశారా?

వర్ధన్నపేట, డిసెంబరు 15 : రైతు వేదికల కోసం వ్యవసాయ గిడ్డంగిని కూల్చినదానిలో లభ్యమైన రూ.10లక్షల విలువైన టేకు కలప మాయమైంది. అధికారులు అమ్ముకున్నారా ? లేక ప్రజా ప్రతినిధులు కాజేశారా? అన్న అంశంపై వర్ధన్నపేటలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే. వర్ధన్నపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ గిడ్డంగి శిథిలావస్థకు చేరుకుంది. రైతు వేదిక నిర్మాణం కోసం దాన్ని కూల్చగా సుమారు రూ.10లక్షల విలువైన టేకు కర్ర వచ్చింది. మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్య, పంచాయతీరాజ్‌ ఏఈ రవీందర్‌రెడ్డితో సహా కొందరు ప్రజా ప్రతినిధులు అక్కడే ఉండి కర్రను ట్రాక్టర్‌లో తరలించినట్టు సమాచారం. వర్ధన్నపేట పక్క గ్రామంలో కర్రను కోయించారు. ఇందులో కేవలం 25శాతం కర్రను మాత్రమే మునిసిపాలిటీ పరిధిలోని డీసీతండాలో పలుచోట్ల వేశారు. మిగిలిన కర్ర ఎక్కడి వెళ్లిందే ఎవరికీ అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా సమాధానం దాటవేయడం గమనార్హం. కలప మునిసిపాలిటీకి సంబంధించిన ట్రాక్టర్‌లోనే తరలించినా అది ఎక్కడికి వెళ్లిందో తెలియని పరిస్థితి. సిబ్బంది తమ ఫోన్లలో ఫొటోలు తీయడం, అవి ప్రచారమవడం చర్చనీయాంశమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వివాదాన్ని సద్దుమణగడానికి తండాలో పలుచోట్ల వేసిన కర్రతోపాటు వరంగల్‌ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను కూలగొట్టిన కర్రను రూ.40వేలలోపు కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్‌ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2020-12-16T04:46:31+05:30 IST