జూరాలకు పోటెత్తుతున్న వరద

ABN , First Publish Date - 2020-07-19T07:11:49+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. శనివారం ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది....

జూరాలకు పోటెత్తుతున్న వరద

10 గేట్ల ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. శనివారం ప్రాజెక్టుకు 80 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 83,532 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టిలో రెండు రోజులుగా స్వల్పంగా వరద  పెరుగుతోంది. ప్రాజెక్టుకు 36,186 క్యూసెక్కుల నీరు రాగా, 46,130 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్‌ జలాశయానికి 43,570 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో రాగా, 45,995 క్యూసెక్కుల నీటిని జూరాలకు విడుదల చేశారు.  జూరాల నుంచి వస్తున్న నీరు, పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు కలిపి శనివారం శ్రీశైలానికి 89,731క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా, ఇన్‌ఫ్లో పెరగడంతో 838 అడుగులకు చేరింది. మేడిగడ్డ బ్యారేజీలోకి 72 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 24 గేట్లను ఎత్తి, 74,900 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో 11.409 టీఎంసీల నీరు ఉంది.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి మట్టం 17.6అడుగులకు చేరుకుంది.


రికార్డు స్థాయిలో జల విద్యుత్తు

తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన జలశయాలతో సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. మరో పక్క ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న జల విద్యుత్తు కేంద్రాల్లో రికార్డు స్థాయిలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. 2019-20లో వచ్చిన భారీ వరద నీటితో రికార్డు స్థాయిలో రూ.3 వేల కోట్ల విలువ చేసే విద్యుత్తు ఉత్పత్తి చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఉన్న జల విద్యుత్తు కేంద్రాల్లో 4510.200 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఉత్పత్తి జరిగిందని హైడల్‌ ప్రాజెక్టుల సీఈ సురేశ్‌ తెలిపారు. ఈ విద్యుత్తును ట్రాన్స్‌కోతో పాటు వివిధ విద్యుత్తు పంపిణీ సంస్థలకు యూనిట్‌కు రూ.5చొప్పున అమ్మడం వల్ల రూ.3,000 కోట్లు వచ్చాయని వెల్లడించారు. గత ఏడాది రికార్డు స్థాయిలో జూరాలకు 1445.889 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల్లో భారీగా కరెంటు ఉత్పత్తి అయ్యింది. 

Updated Date - 2020-07-19T07:11:49+05:30 IST